 
                                        ముంబైలో నిన్న జరిగిన మహిళల వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్‌లో భారత్ జట్టు ఘన విజయం సాధించి ఫైనల్స్‌లో అడుగు పెట్టింది. ఏడుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచినా ఆస్ట్రేలియా జట్టుని ఓడించడం చాలా కష్టం. పైగా ఆస్ట్రేలియా జట్టు ఏకంగా 338 పరుగులు చేసి తమని గెలవడం అసాధ్యంగా మార్చేసింది.
ఇలాంటి ఈ మ్యాచ్‌లో భారత్ జట్టు తడబడుతూ ఆట మొదలుపెట్టి ఇంకా 9 బాల్స్ మిగిలి ఉండగానే ఆస్ట్రేలియాపై విజయం సాధించడం విశేషం.
ఈ మ్యాచ్‌లో మరో విశేషమేమిటంటే, ఈ ప్రపంచ కప్ పోటీలలోనే రెండుసార్లు డకవుట్ అయ్యి పక్కన పెట్టబడిన భారత్ క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్ వల్లనే భారత్ విజయం సాధించింది.
ఆమె, హర్మాన్ ప్రీత్‌తో కలిసి అత్యద్భుతంగా ఆడుతూ మొదట చెరో హాఫ్ సెంచరీ పూర్తి చేశారు. ఆ తర్వాత హర్మాన్ 89 పరుగుల వద్ద అవుట్ అవడంతో మళ్ళీ జెమీమా రోడ్రిగ్స్ పై ఒత్తిడి పెరిగిపోయింది.
కానీ ఈసారి ఆస్ట్రేలియాని ఓడించి తీరాలనే పట్టుదలతో చెలరేగిపోయి 115 బాల్స్‌కి సెంచరీ పూర్తిచేసి, 127 రన్స్‌తో నాటవుట్‌గా నిలిచి భారత్ జట్టుని ఒంటి చేత్తో గెలిపించింది.
అనేక అవమానాలు, పరాభవాలు, ఓటములు, కన్నీళ్ళు, గాయాలను భరించిన ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత జెమీమా రోడ్రిగ్స్ తీవ్ర భావోద్వేగానికి గురై మైదానంలోనే కన్నీళ్ళు పెట్టుకొని బోరున ఏడ్చేసింది.
మ్యాచ్ ఓడిపోతే కన్నీళ్ళు పెట్టుకునేవారిని ఎందరినో మనం చూసి ఉంటాము. కానీ ఒంటి చేత్తో జట్టుని గెలిపించి జట్టుని ఫైనల్స్‌కి చేర్చిన తర్వాత తీవ్ర భావోద్వేగంతో ఆమె కన్నీళ్ళు కార్చడం చూసి ప్రేక్షకులు కూడా ఆర్ద్రతతో ఆమెకు జేజేలు పలికారు.
ఈ ఆదివారం భారత్-దక్షిణాఫ్రికా మద్య ఫైనల్ మ్యాచ్ జరుగబోతోంది. సెమీ ఫైనల్స్‌లో భారత్ జట్టు ఆట తీరు, పోరాట పటిమ చూసినప్పుడు ఫైనల్స్ కూడా తప్పకుండా విజయం సాధించి ప్రపంచ కప్ సాధిస్తారని నమ్మకం ఏర్పడుతుంది.