కోలీవుడ్ సూపర్ స్టార్ హోదాని వదులుకొని టివికే పార్టీతో తమిళనాడు రాజకీయాలలో ప్రవేశిస్తున్న విజయ్ దళపతికి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉన్నాయి. తాజాగా ఆయన భార్య సంగీత విడాకులు కోరుతూ చెంగల్ పట్టు కోర్టులో నేడు కేసు వేశారు. దానిని విచారణకు స్వీకరించిన న్యాయస్థానం ఏప్రిల్ 20 విచారణకు హాజరు కావాలని విజయ్‌కి నోటీస్ పంపింది.
విజయ్, సంగీతల వివాదం 1990లో జరిగింది. వారికి ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. ఇద్దరూ 26 ఏళ్ళు కలిసి కాపురం చేసిన తర్వాత ఇప్పుడు మనస్పర్ధలతో విడాకులు తీసుకునే పరిస్థితి ఏర్పడింది. నిజానికి వారు విడిపోబోతున్నారని ఏడాదిగా కోలీవుడ్, తమిళ మీడియాలో ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు సంగీత భర్త నుంచి విడాకులు కోరుతూ కోర్టులో కేసు వేయడంతో అవి నిజమేనని స్పష్టమయ్యింది. దీనిపై విజయ్ ఇంకా స్పందించాల్సి ఉంది.
వరుసగా అనేక సమస్యలు, కేసులు ఎదుర్కొంటూనే విజయ్ సొంత పార్టీతో ఏప్రిల్-మే నెలల్లో జరుగబోయే శాసనసభ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఇలాంటి సమయంలో ఇంట్లోనే ఈ సమస్య ఏర్పడటం ఆయనకు చాలా పెద్ద ఎదురుదెబ్బే!