నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం రాయపురం గ్రామానికి చెందిన బాల ఆకాష్ (16) భువనగిరి శివారులో పెద్దపల్లి వద్ద గల మైనార్టీ గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ఈ నెల 15న సాయంత్రం బాల ఆకాష్, స్నేహితుడు రహమత్ ఖాన్ పాఠశాల సమీపంలో గల నీటి గుంతలో స్నానం చేసేందుకు దిగారు. నీటి గుంత చాలా లోతుగా ఉండటంతో బాల ఆకాష్ దానిలో మునిగి చనిపోయాడు. రహమత్ ఖాన్ మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు.
ఈ ఘటనపై ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తూ బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా విద్యాశాఖాధికారులను ఆదేశించింది. అధికారులు మైనార్టీ గురుకుల పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు, సిబ్బందిని ప్రశ్నించి వివరణ తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం నిర్వహించి బాలుడు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాయపురం గ్రామానికి వెళ్ళి బాల ఆకాష్ కుటుంబాన్ని పరామర్శించారు. బాలుడి తల్లితండ్రులను ఓదార్చి వారికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అక్కడి నుంచే మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (TMREIS) కార్యదర్శి షఫీ ఉల్లాతో ఫోన్‌లో మాట్లాడారు. బాల ఆకాష్ కుటుంబానికి వెంటనే న్యాయం చేయాలని కేటీఆర్ కోరారు.