ఖమ్మం జిల్లా వెలుగుమట్ల గ్రామంలో సర్వే నం.లు 147,148,149లో భూదాన్ భూములలో అక్రమంగా నిర్మించుకున్న ఇళ్ళని రెవెన్యూ, మున్సిపల్ అధికారులు ఈ నెల 24న కూల్చివేశారు. సుమారు రూ.250 కోట్లు విలువగల 32 ఎకరాలను స్వాధీనం చేసుకున్నారు.
రోడ్డున పడ్డ బాధిత కుటుంబాలు ఈ కూల్చివేతలపై తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బిజేపి, బీఆర్ఎస్ పార్టీ నేతలు వారికి సంఘీభావం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. కనుక జిల్లా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో సహా జిల్లా కాంగ్రెస్ నేతలు వారికి ధీటుగా జవాబిస్తున్నారు.
బాధితులు: కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓట్లు వేస్తే మేము పైసాపైసా కూడబెట్టుకొని కట్టుకున్న మా ఇళ్ళని కూల్చేసి మమ్మల్ని రోడ్డున పడేసింది.
బిజేపి: రేవంత్ రెడ్డి ఇష్టారాజ్యం చేస్తున్నారు. హైదరాబాద్‌లో వేలకోట్లు విలువ చేసే భూములను ఆక్రమించుకొని కాలేజీలు, ఆసుపత్రులు, ఫామ్‌హౌసులు జోలికి పోయే ధైర్యం రేవంత్ రెడ్డికి లేదు. కానీ ఓట్లు వేసి గెలిపించిన పేదల ప్రజల ఇళ్ళు కూల్చగలరు. రాష్ట్రంలో ఏం జరుగుతోందో రాహుల్ గాంధీకి తెలుసా లేదా?
బీఆర్ఎస్ పార్టీ: అక్కడ హైదరాబాద్‌లో నిత్యం పేదల ఇళ్ళు కూల్చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఖమ్మంలో కూల్చేశారు. రేపు ఇంకెక్కడ కూల్చేస్తారో? ఇందుకు ప్రజలే మీ ప్రభుత్వాన్ని కూల్చేయడం ఖాయం.
జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి: హైకోర్టు స్టే విధించిన భూముల జోలికి పోలేదు. కూల్చివేతలపై దాఖలైన లంచ్ మోషన్ పిటిషన్‌ని హైకోర్టు కూడా తిరస్కరించింది. ప్రభుత్వ భూములు కబ్జాకు గురయ్యాయని నిర్ధారించుకున్న తర్వాతే చట్టబద్దంగా ఆక్రమణలు తొలగించాము.