రాజ్యసభ నామినేషన్స్‌ ప్రక్రియ నేటి నుంచే

February 26, 2026


img

తెలంగాణలో రెండు స్థానాలతో సహా దేశవ్యాప్తం వివిధ రాష్ట్రాలలో ఖాళీ అవుతున్న 37 రాజ్యసభ స్థానాల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 26న నోటిఫికేషన్‌ జారీ చేసింది. 

దాని ప్రకారం నేటి నుంచి నామినేషన్స్‌ ప్రక్రియ మొదలవుతుంది. మార్చి 5వరకు నామినేషన్స్‌ వేసేందుకు గడువు. మార్చి 6న నామినేషన్స్ పరిశీలన, నామినేషన్స్ ఉప సంహరణ గడువు మార్చి 9. 

మార్చి 16 ఉదయం 9.00 గంటల నుంచి సాయంత్రం 4.00 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 5.00 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలుపెట్టి వెంటనే ఫలితాల వెల్లడిస్తారు.    

తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యులు డా.అభిషేక్ మను సింఘ్వీ, కేఆర్ సురేష్ రెడ్డి పదవీకాలం ఏప్రిల్‌ నేలతో ముగుస్తుంది. కనుక కాంగ్రెస్‌ పార్టీలో పలువురు సీనియర్లు రాజ్యసభ సీటు కోసం ప్రయత్నాలు ముమ్మురం చేశారు. 

రాజ్యసభ సీటు కోసం ప్రయత్నిస్తున్నవారిలో సీనియర్లు వీహెచ్, చిన్నారెడ్డి, జెట్టి కుసుమ కుమార్‌, కోదండ రెడ్డి, జీవన్ రెడ్డి, మధుయాష్కీ గౌడ్, షబ్బీర్ అలీ, హర్కర వేణుగోపాల్, బెల్లయ్య నాయక్ ఇంకా పలువురున్నారు. ఇండియా కూటమి తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా పోటీ చేసిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. వీరితో పాటు పదవీ విరమణ చేస్తున్న డా.అభిషేక్ మను సింఘ్వీ కూడా రేసులో ఉన్నారు. 

రెండు స్థానాలకు ఇంతమంది పోటీ పడుతున్నందున వీరిలో ఎవరికీ లక్కీ ఛాన్స్ లభిస్తుందో మార్చి 5లోగా తేలిపోతుంది. 


Related Post