రాజుగారు ఏడు చేపల కథ... తెలుగు ప్రజలందరికీ తెలిసిందే. తెలియని కొత్త తరం కోసం ఈ కథ!
సంక్షేమ పధకాలలో భాగంగా ప్రభుత్వాలు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తుంటాయి. కొన్ని వర్గాల ప్రజలకు రాయితీపై నామ మాత్రపు ధరకు విద్యుత్ ఇస్తుంటాయి. పరిశ్రమలు, ఐటి కంపెనీలను ఆకర్షించేందుకు వాటికీ విద్యుత్ రాయితీలు ఇస్తుంటాయి.
కనుక ఈ భారం మొత్తం ప్రభుత్వాలే భరించాలి. కానీ ప్రభుత్వం వద్ద అంత డబ్బు లేదు!
రాష్ట్ర ఆదాయంలో సగానికిపైగా గత ప్రభుత్వం చేసిన అప్పులు, వడ్డీలకే సరిపోతోంది. కనుక మళ్ళీ కొత్తగా అప్పులు చేయక తప్పడం లేదు.
ఇలాంటి పరిస్థితిలో విద్యుత్ సరఫరా సంస్థలకు ప్రభుత్వం బకాయిలు పెండింగ్ పెడితే... అవి విద్యుత్ ఉత్పత్తి సంస్థల బకాయిలు చెల్లించలేక పెండింగ్ పెడతాయి. అప్పుడు అవి (ఎన్టీపీసీ) తమకు బొగ్గు సరఫరా చేసే సింగరేణి వంటి సంస్థలకు బకాయిలు పెండింగ్... ఈ అప్పుల భారంతో ఒక్కో వ్యవస్థ వరుసగా కుప్పకూలితే?
ఇలాంటిదే మరో పధకం మహాలక్ష్మి... ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం! ఈ హామీతో లబ్ది పొందింది మొదట కాంగ్రెస్ పార్టీ... తర్వాత మహిళలు.
కనుక దీని పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే. కానీ ప్రభుత్వం వద్ద అంత డబ్బు లేదు. కారణాలు ముందే చెప్పుకున్నాము. కనుక ఎప్పటికప్పుడు బకాయిలు చెల్లించలేని పరిస్థితి.
మహాలక్ష్మితో ఆర్టీసీకి ఆదాయం సగానికి తగ్గింది. ఆదాయం తగ్గినా నిర్వహణ ఖర్చులు పెరుగుతాయే తప్ప ఏమాత్రం తగ్గవు. డీజిల్, బస్సుల టైర్లు, స్పేర్ పార్టుల ధరలు పెరుగుతూనే ఉంటాయి. కానీ ఆదాయం పెరిగే అవకాశం లేదు. ప్రభుత్వం బకాయిలు ఇవ్వలేదు. కనుక ఆర్టీసీ మెల్లగా మునుగుతూ ఉంటుంది.
కానీ టైటానిక్ షిప్పు మునిగిపోతున్న సంగతి త్వరగా బయటపడనట్లే ఇవి కూడా సగం మునిగాకే బహిర్గతం అవుతాయి. దీని కంతటికీ కారణం ఏమిటి? ఎన్నికలలో గెలుపు కోసం ఇచ్చిన హామీలే... కదా?