హిందువులు పరమ పవిత్రంగా భావించే తొలి ఏకాదశి లేదా శయని ఏకాదశి సందర్భంగా దేశవ్యాప్తంగా భక్తిశ్రద్దలతో జరుపుకుంటున్నారు. ఆషాడ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఈ తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్తారు.
కనుక దీనిని శయని ఏకాదశి అని కూడా అంటారు. మళ్ళీ కార్తీకమాసంలో శుద్ధ ఏకాదశినాడు స్వామివారు మేల్కొంటారు. కనుక పలువురు భక్తులు ఈ నాలుగు నెలలు చాతుర్మాస దీక్షలు చేపట్టి ఆధ్యాత్మిక జీవనం గడుపుతారు. వ్యవసాయం చేసే రైతులు భూమాతకి, విష్ణుమూర్తికి పూజలు చేసి నేటి నుంచి వ్యవసాయ పనులు మొదలుపెడతారు.
నెలకు రెండు చొప్పున ఏడాదికి మొత్తం 24 ఏకాదశులు ఉంటాయి. అవి ఈ తొలి ఏకాదశితోనే ప్రారంభం అవుతాయి. అలాగే వరుసగా పండుగలు కూడా వస్తుంటాయి. ముందుగా శ్రావణమాసం నోములు, తర్వాత భాద్రపద మాసం నుంచి వరుసగా వినాయక చవితి, దసరా, దీపావళి పండుగలు, తర్వాత కార్తీక మాసంలో నోములు, పిక్నిక్‌లు జరుపుకుంటారు. అలాగే గృహా ప్రవేశాలు, పెళ్ళిళ్ళు వంటి శుభకార్యాలు కూడా జరుపుకుంటారు.
కనుక పరమ పవిత్రమైన ఈ తొలి ఏకాదశితో మళ్ళీ జీవితంలో సంతోష సమయం కూడా మొదలవుతుందని చెప్పవచ్చు.
నేడు తొలి ఏకాదశి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా వైష్ణవ దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
తెలంగాణలో యాదాద్రి, భద్రాద్రి, చిలుకూరి బాలాజీ, బిర్లామందిర్, ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయాలలో తెల్లవారుజాము నుంచే భక్తులు దర్శనాలకు క్యూ కట్టారు.