చామకూర ఎన్నటికీ మారదు: మల్లారెడ్డి

July 24, 2026


img

మాజీ మంత్రి, బీఆర్ఎస్‌ పార్టీలో సీనియర్ నేత చామకూర మల్లారెడ్డి పార్టీ మారబోతున్నారంటూ చాలా కాలంగానే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దానికి బలమైన కారణాలే కనిపిస్తున్నాయి. 

హైదరాబాద్‌.. చుట్టుపక్కల ఆయన కుటుంబానికి పలు కాలేజీలున్నాయి. వాటిలో కొన్ని నిబంధనలకు విరుద్దంగా నిర్మించినవి ఉన్నాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే కారణంగా జిహెచ్‌ఎంసి సిబ్బంది ఆయన కాలేజీ భవనాన్ని కూల్చివేయబోయారు. 

కానీ మల్లారెడ్డి వెంటనే సిఎం రేవంత్ రెడ్డిని కలిసి మాట్లాడిన తర్వాత కూల్చివేతలు నిలిచిపోయాయని టాక్. కనుక తన ఆస్తులను కాపాడుకునేందుకు అయన అప్పుడే కాంగ్రెస్‌ పార్టీలో చేరబోతున్నారంటూ ఊహాగానాలు వినిపించాయి. కానీ చేరలేదు. 

అదేవిధంగా అయన కాలేజీలపై పలుమార్లు ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేసి కేసులు నమోదు చేశారు. ఈడీ కూడా వేరేగా కేసులు నమోదు చేసింది. కనుక వాటి నుండి ఉపశమనం పొందేందుకు మల్లారెడ్డి బిజేపిలో చేరబోతున్నారంటూ ఊహాగానాలు వినిపించాయి. కానీ చేరలేదు. అయినా ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. 

నేడు బీఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా అయనని కలిసి అభినందించారు. ఆ తర్వాత  మీడియా ముందుకు వచ్చి ఆ ఊహాగానాలను ఖండించారు. 

తాను బీఆర్ఎస్‌ పార్టీలోనే కొనసాగుతానని, కేటీఆర్‌ని ముఖ్యమంత్రిగా చూడాలనేదే తన కోరిక అని స్పష్టం చేశారు. కనుక చామకూర రంగు, రూపం, రుచి ఎన్నటికీ మారదనుకోవచ్చు. 


Related Post