టాలీవుడ్‌లో నిర్మాతకి గౌరవం లేదు: పీవీపీ

May 14, 2026
img

ప్రస్తుతం టాలీవుడ్‌లో నిర్మాతలకి, తెలంగాణ ఎగ్జిబిటర్స్ (సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమానులు)కి మద్య టికెట్ ఆదాయం విషయంలో వివాదం కొనసాగుతోంది. 

ఈ నేపధ్యంలో బలుపు, బ్రహ్మోత్సవం, క్షణం, ఊపిరి, మహర్షి వంటి పలు భారీ చిత్రాలు నిర్మించిన ప్రముఖ నిర్మాత ప్రసాద్ వి పొట్లూరి మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. “వందల కోట్లు పెట్టుబడి పెట్టి సినిమాలు తీసే నిర్మాతలకు టాలీవుడ్‌లో ఏ మాత్రం గౌరవం లేదు. టాలీవుడ్‌లో సినిమా తీయడమంటే మన చెప్పుతో మనం కొట్టుకున్నట్లే. టాలీవుడ్‌లో నిర్మాతని ఓ జోకర్ లేదా బఫూన్‌గా భావిస్తూ యూనిట్ సభ్యులు నిర్మాత ఎదుటే చాలా చులకనగా మాట్లాడుతుంటారు. 

సినిమాకి పెట్టుబడి పెట్టేది నిర్మాతలే అయినా హీరోలే సినీ పరిశ్రమని నడిపిస్తుంటారు. సినిమా మొదలుపెట్టినప్పటి నుంచి రిలీజ్ అయ్యేవరకు పెత్తనమంతా వారిదే. నిర్మాత మాటకి బొత్తిగా విలువీయరు. అలాగని సినిమా ఫ్లాప్ అయితే హీరోలతో సహా ఎవరూ బాధ్యత తీసుకోరు. పెట్టుబడి సినిమా తీసిన నిర్మాతే రోడ్డున పడతాడు. 

టాలీవుడ్‌లో సినిమాలు తీస్తే ఉన్న డబ్బు పోతుంది. కనీసం గౌరవం కూడా లభించదు. ‘టెంపర్’ సినిమా నిర్మించేందుకు నేను బండ్ల గణేశ్‌కు వడ్డీపై ఫైనాన్స్ చేశాను. కానీ ఆ డబ్బు తిరిగి రాబట్టుకోవడంలో అనేక ఇబ్బందులు, అవమానాలు ఎదురయ్యాయి. 

ఇన్ని సమస్యలు, అవమానాలు, డబ్బు నష్టం భరిస్తూ సినిమాలు నిర్మించడం అవసరం లేదని మానేశాను. అప్పటి నుంచి ప్రశాంతంగా జీవిస్తున్నాను,” అని అన్నారు.

Related Post