పరస్పరం షాకులు ఇచ్చుకుంటున్న బిజేపి, జనసేన

August 09, 2026


img

తెలంగాణలో జనసేనతో పొత్తు ఉండదని బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు షాక్ ఇవ్వగా, జనసేన కూడా బిజేపికి పెద్ద షాకే ఇచ్చింది. బీజేపీకి చెందిన పలువురు నేతలు పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు.

మొత్తం 16 మంది నేతలు జనసేన కండువా కప్పుకోగా, వారిలో బీజేపీ, దాని అనుబంధ సంస్థల్లో పనిచేసిన నలుగురు నేతలు ఉన్నారు. మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన హైందవి రెడ్డి పాండెం, సనత్‌నగర్‌కు చెందిన అనిల్ గీడికపల్లి, రవి టెండూల్కర్, బీజేపీ యువజన మోర్చాకు చెందిన ఇల్లందు నేత గొగ్గల నాగ స్రవంతి జనసేనలో చేరిన వారిలో ఉన్నారు.

మరోవైపు తెలంగాణలో బీజేపీ సీనియర్ నాయకుల మధ్య విభేదాలను పరిష్కరించి అందరినీ ఒక్కతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతుండగా, ఏపీలో బిజేపికి మిత్రపక్షంగా, ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ ఈవిధంగా చేయడం తెలంగాణ బిజేపి నేతలకు పెద్ద షాక్ అనే చెప్పాలి. 

పొత్తులపై రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు చేసిన ప్రకటనపై కూడా జనసేన తెలంగాణ అధ్యక్షుడు శంకర్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు చురకలు వేసినట్లే ఉన్నాయి. పొత్తుల అంశం రామచందర్ రావు లేదా తన పరిధిలో లేదని, దీనిపై పవన్ కల్యాణ్, బీజేపీ జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు.

ఈ నేపధ్యంలో తెలంగాణలో బీజేపీ, జనసేనల మధ్య రాజకీయ సమీకరణాలు ఎలా మారుతాయన్న దానిపై ఆసక్తి నెలకొంది. 


Related Post