తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నేడు నర్సంపేట నియోజకవర్గంలోని నల్లబెల్లికి వెళ్ళనున్నారు. పార్టీ స్థాపించినప్పటి నుంచి ఆయనతో కలిసి పని చేస్తూ అత్యంత సన్నిహితుడుగా మెలిగిన బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి ఇటీవల గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే.
ఆయన కుటుంబాన్ని ఓదార్చేందుకు కేసీఆర్ నేడు నల్లబెల్లి వెళ్తున్నారు. వారి కుటుంబానికి రూ.2.25 కోట్లు ఆర్ధిక సాయం చేస్తామని బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. కేసీఆర్ స్వయంగా ఆ చెక్‌ను పెద్ది సుదర్శన్ రెడ్డి భార్యకు అందజేయనున్నారు.
అలాగే నియోజకవర్గంలో ఆయన అనుచరులు, బీఆర్ఎస్ నేతలతో కూడా కేసీఆర్ సమావేశమై వారికీ ధైర్యం చెప్తారని తెలుస్తోంది. ఇంతకాలం నియోజకవర్గంలో పార్టీ పూర్తి బాధ్యతలు పెద్ది సుదర్శన్ రెడ్డి చూసుకుంటున్నారు.
ఇప్పుడు అయన స్థానంలో మరొకరికి ఆ బాధ్యత అప్పగించక తప్పదు. కనుక కేసీఆర్ నల్లబెల్లి పర్యటన రాజకీయంగా కూడా కీలకమైనదే అని భావించవచ్చు. ఒకవేళ పెద్ది సుదర్శన్ రెడ్డి భార్య ఆ స్థానం స్వీకరించేందుకు అంగీకరిస్తే ఆమెకే అప్పగించినా ఆశ్చర్యం లేదు.