ఫోన్ ట్యాపింగ్‌ కేసులో మరో ఛార్జ్‌ షీట్‌?

August 08, 2026


img

సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్‌ కేసు విచారణ జరుపుతున్న సిట్‌ అధికారులు మరో వారం రోజుల్లో ఇదే కేసులో అదనపు ఛార్జ్‌ షీట్‌ దాఖలు చేయబోతున్నట్లు సమాచారం. ఈసారి దాఖలు చేయబోతున్న ఛార్జ్‌ షీట్‌లో ఐపీసి సెక్షన్స్‌తో పాటు ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ కింద కూడా అభియోగాలు నమోదు చేయబోతున్నట్లు తెలుస్తోంది. 

ఈ చట్టం ప్రకారం కేవలం దేశ భద్రత కొరకు మాత్రమే ముందస్తు అనుమతులు పొంది ఫోన్ ట్యాపింగ్‌ చేయాల్సి ఉంటుంది. కానీ గత ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడి చట్ట విరుద్ధంగా వ్యక్తులపై నిఘా పెట్టడం, ఆ విధంగా సేకరించిన సమాచారాన్ని రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకున్నట్లు సిట్‌ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ కేసులో ఇప్పటికే అధికార, ప్రతిపక్ష నేతలతో సహా సుమారు 600 మందికి పైగా వ్యక్తులను విచారించి బలమైన సాక్ష్యాధారాలు సేకరించారు. అలాగే నేర నిరూపణకు అవసరమైన డిజిటల్, సాంకేతిక ఆధారాలతో పాటు, ఈ కేసులో నిందితులు ధ్వంసం చేసిన హార్డ్ డిస్కులు, ఇతర ఆధారాలను కూడా సేకరించి ఛార్జ్‌ షీట్‌ రూపొందించారు. 

సిట్‌ అధికారులు త్వరలోనే నాంపల్లి కోర్టుకు సమర్పించబోతున్న అదనపు ఛార్జ్‌ షీట్‌లో ఈ చట్టం ప్రకారం అభియోగాలు నమోదు చేస్తే ఈ కేసు తీవ్రత మరింత పెరుగుతుంది. 

కనుక ఈ కేసు తదుపరి విచారణ మొదలైతే తెలంగాణలో మళ్ళీ అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీఆర్ఎస్‌ పార్టీల మద్య రాజకీయ యుద్ధాలు మొదలవడం ఖాయం. 

కానీ రాజకీయ నాయకుల ప్రమేయం ఉన్న పలు తీవ్రమైన కేసుల విచారణ ఏళ్ళ తరబడి సాగుతున్నందున ఈ కేసు విచారణ ఎప్పటికైనా ముగుస్తుందా? నేరం నిరూపింఛి దోషులకు శిక్షలు విధించబడతాయా?అనేదే అసలు ప్రశ్న. 


Related Post