సంక్రాంతి అల్లుడులా వరుసపెట్టి హిట్లు కొడుతున్న విక్టరీ వెంకటేష్, అయన సోదరుడు దగ్గుబాటి సురేష్‌లకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
హైదరాబాద్ ఫిలింనగర్‌లోని డెక్కన్ కిచెన్ హోటల్ స్థల లీజు వివాదం, ఆ కారణంగా భవనం కూల్చివేత ఘటనలో దగ్గుబాటి సురేష్ బాబు, వెంకటేష్, రానా తదితరులపై క్రిమినల్ కేసు నమోదైంది.
కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి వారు బలవంతంగా దానిని కూల్చివేసి, ఆక్రమించారంటూ కె నందకుమార్ ఫిర్యాదు ఆధారంగా వారిపై ఈ కేసు నమోదైంది. నాంపల్లి కోర్టు దీని విచారణ జరుపుతోంది.
ఈ కేసుని కొట్టివేయాలంటూ వారు హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. దానిపై నేడు విచారణ జరిపిన న్యాయస్థానం ఇది సివిల్ వివాదం కనుక దీనిలో క్రిమినల్ కేసుగా మార్చడం సరికాదనే వాదనతో ఈ కేసుని కొట్టివేయలేమని స్పష్టం చేసింది.
నిందితులు డెక్కన్ కిచెన్ హోటల్లో జొరబడటం, అక్కడి వస్తువులు ధ్వంసం చేయడం, కొన్ని ఎత్తుకుపోవడం వంటివన్నీ క్రిమినల్ చర్యల కిందేవస్తాయి. పిటిషనర్ వాటికి సంబంధించి సాక్ష్యాధారాలు కూడా సమర్పించారు. కనుక ఈ కేసు విచారణ కొనసాగుతుందని స్పష్టం చేస్తూ వారి క్వాష్ పిటిషన్నే హైకోర్టు కొట్టి వేసింది.
ఈ కేసు విషయంలో మరేదైనా వాదనలు వినిపించాలనుకుంటే నాంపల్లి కోర్టులోనే తేల్చుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసుని ఎదుర్కోవడం దగ్గుబాటి సోదరులకు పెద్ద సమస్య కాదు కానీ ఖచ్చితంగా ఇబ్బందికరమే.