ఆహార కల్తీని అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. రాష్ట్రంలో ఆహార కల్తీపై కట్టడి చేసేందుకు 100 మంది పోలీసు సిబ్బందితో ప్రత్యేక అమలు విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. డీజీపీగా బాధ్యతలు చేపట్టి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఆయన ఈ వివరాలను వెల్లడించారు.
ఈ ప్రత్యేక విభాగం ఆహార భద్రత, ఔషధ నియంత్రణ శాఖలతో సమన్వయంగా పనిచేస్తుందని తెలిపారు. త్వరలో "టీ-సేఫ్" పేరుతో కొత్త వ్యవస్థను ప్రారంభించి రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు పెంచడంతో పాటు ఆహార నమూనాల పరీక్షల సామర్థ్యాన్ని కూడా విస్తరిస్తామని చెప్పారు. రాష్ట్రంలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆహార కల్తీని అరికట్టడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని పేర్కొన్నారు.
మాదకద్రవ్యాల అక్రమ రవాణా, సైబర్ నేరాలపై కూడా మరింత కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ తెలిపారు. గత ఏడాది తెలంగాణలో సైబర్ మోసాల కారణంగా సుమారు రూ.1,750 కోట్ల నష్టం జరిగిందని, ప్రజలు అధిక లాభాలు వస్తాయంటూ వచ్చే పెట్టుబడి మోసాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అలాగే ట్రాఫిక్ నిర్వహణను బలోపేతం చేసేందుకు ‘టీ-మార్స్’ పేరుతో కొత్త ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ బ్యూరోను కూడా ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.