తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్‌పర్సన్ డాక్టర్ గుమ్మడి వెన్నెల నేతృత్వంలో ఆ సంస్థ సభ్యులు శుక్రవారం మెదక్ జిల్లా కేంద్రంలో గద్దర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్న ప్రదేశంలో గద్దర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గద్దర్ జీవితం, పోరాట స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శంగా నిలవాలని అన్నారు. పేదలు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన గద్దర్ తన పాటల ద్వారా దోపిడీ వ్యవస్థను ప్రశ్నించారన్నారు.
ఆట, పాటలతో దేశవ్యాప్తంగా ప్రజల్లో చైతన్యం నింపడంతో పాటు ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ప్రజలను చైతన్యపరిచి ఉద్యమానికి ఊపిరి పోసిన ప్రజాకవిగా గద్దర్ చరిత్రలో నిలిచిపోయారరు.
గద్దర్ జన్మించిన మెదక్ జిల్లాకు ఆయన పేరును ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలని ప్రజా సంఘాల తరఫున డాక్టర్ వెన్నెల డిమాండ్ చేశారు. అలాగే హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై కూడా గద్దర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు.
కార్యక్రమంలో మాలల హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మల మైసయ్య, కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి బండారు గంగాధర్, సీనియర్ జర్నలిస్టు బొందుగుల నాగరాజు పాల్గొన్నారు.