అప్పుడు మౌనం.. ఇప్పుడు పోరాటం.. ఇదెక్కడి న్యాయం?

July 29, 2026


img

టీఆర్ఎస్‌ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మంగళవారం సిరిసిల్ల జిల్లాలోని నేరెళ్ళలోని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.

నాడు కేసీఆర్‌ హయంలో ఇసుక అక్రమ రవాణా అడ్డుకునందుకు నేరెళ్ళలో 8 మంది దళితులను పోలీసులు అరెస్ట్ చేసి కస్టడీలో చిత్ర హింసలు పెట్టారు. ఆనాడే దీనిపై రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టించింది. 

వారిలో గోపాల్ అనే యువకుడు ఆనాటి నుంచి మంచాన్న పడి తీవ్ర అనారోగ్యం ఇటీవల చనిపోయాడు. అతని కుటుంబాన్ని కల్వకుంట్ల కవిత పరామర్శించి ధైర్యం చెప్పారు. 

అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, “ఈ అమానుష ఘటన జరిగినప్పుడు నేను బీఆర్ఎస్‌ ప్రభుత్వంలోనే ఉన్నందుకు సిగ్గుతో తల దించుకుని, బాధిత కుటుంబాన్ని క్షమాపణ చెప్పుకున్నాను. నేరెళ్ళ ఘటన జరిగి 9 ఏళ్ళు గడిచినా ఇంత వరకు ఒక్క పోలీస్ అధికారిపై కూడా చర్యలు తీసుకోలేదు. 

బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు నేను పోరాడుతాను. ఒక్కో కుటుంబానికి కోటి రూపాయలు నష్ట పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా,” అని కల్వకుంట్ల కవిత అన్నారు. 

నాడు బీఆర్ఎస్‌ పార్టీలో, ప్రభుత్వంలో ఉన్నప్పుడే కల్వకుంట్ల కవిత తన తండ్రిని, అన్న కేటీఆర్‌ని ఈవిధంగా గట్టిగా నిలదీసి ఉండి ఉంటే నేడు ఆమె మాటలు సహేతుకంగా ఉండేవి. 

సిఎంగా ఉన్న తన తండ్రి కేసీఆర్‌పై, సిరిసిల్లా ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న తన అన్న కేటీఆర్‌పై ఒత్తిడి చేసి దళితులను చిత్ర హింసలు పెట్టిన పోలీస్ అధికారులపై చర్యలు తీసుకునేలా చేసి ఉంటే అందరూ హర్షించేవారు. 

అప్పుడే ఆమె బాధిత కుటుంబాలను పరామర్శించి, ప్రభుత్వం తరపున ఒక్కొక్కరికీ కోటి రూపాయలు నష్ట పరిహారం అందజేసి ఉంటే గౌరవంగా ఉండేది. 

కానీ ఆనాడు మౌనంగా ఉండిపోయి ఇప్పుడు సిగ్గుపడటం, క్షమాపణలు చెప్పడం, బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడుతానని చెప్పడం దేనికి?

ఇప్పుడు టీఆర్ఎస్‌ పార్టీతో వేరు కుంపటి పెట్టుకుని రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నిస్తున్నారు. కనుక తన రాజకీయాల కోసమే ఇప్పుడు ఈ పరామర్శలని అనుకోవాల్సి ఉంటుంది. 

ఇంతవరకు ఆమె ఎంత మంది బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడుతానని హామీలు ఇచ్చారు?వారిలో ఎంత మంది తరపున పోరాటాలు చేస్తున్నారు? 

అయినా ఆమె ప్రభుత్వాన్ని నిలదీసే ముందు తన తండ్రిని, అన్నని నిలదీయాలి కదా?కానీ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఇది రాజకీయమే కదా?


Related Post