‘దసరా’ ఫేమ్ దీక్షిత్ శెట్టి హీరోగా తెరకెక్కిన ‘కేజేక్యూ’ (కింగ్, జాకీ, క్వీన్) ఆగస్ట్ 7న విడుదల కాబోతోంది. కనుక సోమవారం ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన ‘కేకే’ ఇటీవలే కన్నుమూశారు. సినిమా పూర్తిచేసి విడుదలకు కొన్ని రోజుల ముందు చనిపోవడంతో చిత్ర బృందం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. కనుక నిన్న విడుదల చేసిన ట్రైలర్‌లో ఈ సినిమాను ఆయనకు అంకితం చేస్తున్నట్లు తెలియజేసింది.
ట్రైలర్ రా అండ్ రస్టిక్ యాక్షన్‌తో ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో శశి ఓడెల, యుక్తి తరేజా ముఖ్యపాత్రలు చేశారు.
90వ దశకంలో తెరకెక్కిన క్రైమ్ డ్రామాగా ఈ సినిమా రూపొందింది. ఇద్దరు స్నేహితుల మధ్య మొదలైన అనుబంధం తర్వాత అధికారం, అహం, ప్రతీకారం కారణంగా బద్ధ శత్రుత్వంగా ఎలా మారిందనే కథాంశంతో సినిమా సాగనున్నట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది.
‘న్యాయం, అన్యాయం మనకు లేవు.. మనం వేటాడాలి.. లేకపోతే వేటాడబడతాం’ అంటూ ట్రైలర్‌లో వినిపించే డైలాగ్స్ సినిమా టోన్‌ను చెప్పకనే చెబుతున్నాయి. స్నేహితులుగా ఉన్న ఇద్దరు వ్యక్తులు శత్రువులుగా ఎందుకు మారారు? వారి మధ్య హీరోయిన్ పాత్ర ఏమిటి? అనే అంశాలపై ఆసక్తి పెంచేలా ట్రైలర్‌ను కట్ చేశారు.
ఈ సినిమాకు దర్శకత్వం: కేకే; సంగీతం: పూర్ణచంద్ర తేజస్వి,కెమెరా: నాగేశ్ బనెల్, ఎడిటింగ్: శ్రవణ్ కటికనేని;
‘కేజేక్యూ’ చిత్రాన్ని ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. లోహిత్ కొంజర్ల టీజర్ కట్ చేశారు.
‘కేజేక్యూ’ ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ముఖ్యంగా దర్శకుడు కేకే చనిపోయిన తర్వాత ఈ సినిమా విడుదలవడంతో, ఆయన తెరకెక్కించిన ఈ చివరి చిత్రం ఏవిధంగా ఉంటుందో తెలియాలంటే ఆగస్టు 7న థియేటర్లలో విడుదలయ్యే వరకు ఎదురు చూడాలి.