అమెరికా-ఇరాన్ యుద్ధం.. ఆపేదేలే!

July 19, 2026


img

అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం మరింత తీవ్రరూపం దాల్చుతోంది. గత కొన్ని రోజులుగా ఇరు దేశాలు వైమానిక దాడులు, క్షిపణి దాడులతో ఒకదానిపై మరొకటి ప్రతీకారం తీర్చుకుంటున్నాయి.

ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హోర్ముజ్ జలసంధిపై పట్టు కోసం రెండు దేశాలు గట్టిగా ప్రయత్నిస్తుండటంతో ఈ యుద్ధం ప్రభావం యావత్ ప్రపంచ దేశాలపై పడుతోంది. చమురు, గ్యాస్ సరఫరాకు ఆటంకం కలుగుతున్న కారణంగా వాటి ధరలు ఎలాగూ పెరుగుతాయి.

వాటి వల్ల భారత్‌తో పాటు ప్రపంచ దేశాల్లోని సామాన్య ప్రజలపై, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారిపై పెను ప్రభావం పడుతుంది. ద్రవ్యోల్బణం మరింత పెరిగే ప్రమాదం పొంచి ఉంది. ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే దేశాల ఆర్థిక పరిస్థితి తారుమారయ్యే అవకాశం కూడా ఉంది.

కనుక ఇరు పక్షాలు సంయమనం పాటించి, చర్చల ద్వారా పరిష్కారం కనుగొనాలని ఐక్యరాజ్యసమితితో పాటు ప్రపంచ దేశాలు కోరుతున్నాయి. కానీ అటు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌, ఇటు ఇరాన్ పాలకులు ఇద్దరిలోనూ ఇంకా పంతంగా యుద్ధం చేయాలనే ధోరణే కనిపిస్తోంది తప్ప వెనక్కి తగ్గే ఉద్దేశ్యం కనిపించడం లేదు.

అమెరికా-ఇరాన్ మధ్య జరిగిన శాంతి చర్చలు, వారు సంతకాలు చేసిన యుద్ధ విరమణ ఒప్పందాన్ని చిత్తుకాగితంతో సమానంగా భావించి పక్కన పడేసి మళ్ళీ యుద్ధం మొదలుపెట్టారు. కనుక వారంతట వారు ఓపిక నశించి యుద్ధం మానుకోవాలే తప్ప ఎవరూ ఆపలేరనిపిస్తోంది.

ఇరాన్-ఇరాక్ ఏకధాటిగా సుమారు 8 ఏళ్ళు యుద్ధం చేశాయి. రష్యా-ఉక్రెయిన్ గత నాలుగేళ్ళుగా యుద్ధం చేసుకుంటున్నాయి.

ఇరాన్‌తో 'వీకెండ్ పిక్నిక్‌'గా అమెరికా మొదలుపెట్టిన ఈ యుద్ధం అప్పుడే 6 నెలలు కావస్తోంది. కనుక ట్రంప్ దిగిపోయే వరకు ఈ యుద్ధం కొనసాగుతుందేమో?


Related Post