తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి మొదలు పలువురు కాంగ్రెస్ మంత్రులు, నేతలు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ శాసనసభ సమావేశాలకు రాకుండా కోట్లాది రూపాయలు జీతభత్యాలు తీసుకోవడాన్ని ఆక్షేపిస్తున్నారు.
అయితే కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి హోదాలోనే శాసనసభలో అడుగు పెడతారని ఇటీవల కేటీఆర్ ప్రకటింఛి కాంగ్రెస్ పార్టీ చేతికి బలమైన అస్త్రం అందించారు. దీంతో శాసనసభ సమావేశాలకు రానప్పుడు కేసీఆర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ నేతలు నేడు ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేశారు.
పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, కేసీఆర్ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు;కనుక ప్రతిపక్ష నేతగా ఆయన తన విధి నిర్వహించేందుకు తప్పనిసరిగా శాసనసభ సమావేశాలకు రావాలి. కానీ రాకుండా జీతభత్యాలు తీసుకోవడం సబబు కాదు.
ప్రభుత్వం ఆయన భద్రతకు భారీగా ఖర్చు చేస్తోంది. అలాంటప్పుడు అయన కూడా బాధ్యతగా వ్యవహరించాలి కదా? రేపటి నుంచి మొదలయ్యే శాసనసభ సమావేశాలకు కేసీఆర్ తప్పకుండా హాజరవుతారని ఆశిస్తున్నాము,” అని అన్నారు.