తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం నకిరేకల్‌లో జరిగిన బహిరంగ సభలో, తమ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలన, బీఆర్‌ఎస్ పదేళ్ళ పాలనపై శాసనసభలో కేసీఆర్‌తో చర్చకు సిద్ధమని ప్రకటించారు.కనుక కేసీఆర్‌కు దమ్ముంటే శాసనసభ సమావేశాలకు వచ్చి చర్చలో పాల్గొనాలని సవాలు విసిరారు.
తెలంగాణ వస్తే ప్రజల బతుకులు బాగు పడతాయనుకుంటే కేసీఆర్ కుటుంబం ఒక్కటే బాగు పడిందని వేలకోట్ల ఆస్తులు పోగేసుకుందని సిఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆ ఆస్తుల పంపకాలలో తేడా వచ్చినందునే కల్వకుంట్ల కవితని బయటకు గెంటేశారన్నారు. అసలు కేసీఆర్ కుటుంబానికి అన్నివేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయో చెప్పాలని సిఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
ఆ ఆస్తులలో కవితకు వాటా ఇవ్వాల్సి వస్తుందనే కేటీఆర్ ఆమెను బయటకు గెంటేసిన మాట వాస్తవం కాదా? అని సిఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేటీఆర్‌కి చదువు ఉంది కానీ సంస్కారం లేదని, తనకు చదువు, సంస్కారం రెండూ ఉన్నాయని, అందుకే కేటీఆర్ యదేచ్చగా తెలంగాణలో తిరగగలుగుతున్నారని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. నాలుగు ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడిన ప్రతీ ఒక్కరూ నాయకులు కాలేరంటూ కేటీఆర్‌ని ఎద్దేవా చేశారు.
తెలంగాణ అనే తులసివనంలో గంజాయి మొక్కల్లా బీఆర్ఎస్ పార్టీ వ్యాపించిందని, దానిని కూకటివేళ్ళతో సహా పీకి పారేస్తానని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ నెలాఖరుకి సిరిసిల్లాకు, వచ్చే నెలలో సిద్ధిపేటకు వచ్చి సభలు నిర్వహిస్తానని, దమ్ముంటే అడ్డుకోవాలని సిఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి సవాలు విసిరారు.
వచ్చే ఎన్నికల సమయానికి రాష్ట్రంలో ఎమ్మెల్యే సీట్లు పెరిగితే 117 సీట్లు, లేకుంటే 90 సీట్లు గెలుచుకొని మళ్ళీ అధికారంలోకి వస్తామన్నారు. 2034 వరకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీఏ అధికారంలో కొనసాగుతుందని సిఎం రేవంత్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మహాలక్ష్మి, పంట రుణాల మాఫీ,ఉద్యోగాల భర్తీ తదితర హామీలను నేరవేర్చామని చెపుతూ కేసీఆర్ హయంలో జరిగిన అవకతవకల గురించి సిఎం రేవంత్ రెడ్డి గట్టిగా నిలదీశారు.