ఇస్రోతో పోటీగా వేణు ఊడుగుల కూడా చంద్రయాన్

September 05, 2026


img

భారత్‌ అంతరిక్ష సంస్థ ఇస్రో ‘చంద్రయాన్’1,2,3 అంటూ ప్రయోగాలు చేస్తుండగానే నిర్మాతగా మారిన దర్శకుడు వేణు ఊడుగుల కూడా ‘చంద్రయాన్’ అంటూ ఇస్రోతో పోటీకి సిద్దమైపోయారు.   

 ‘నీది నాదీ ఒకే కథ’, ‘విరాట పర్వం’ సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వేణు ఊడుగుల, ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాతో నిర్మాతగా మారి తొలి దశ సినిమాతోనే విజయం అందుకున్నారు. ఇప్పుడు ఆయన సమర్పణలో ‘చంద్రయాన్’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను తాజాగా విడుదల చేశారు.

పల్లెటూరికి చెందిన ముగ్గురు యువకులు అంతరిక్షం ప్రయోగాలు చేసి చంద్రుడిపైకి వెళ్ళాలనుకోవడం ఈ సినిమా కథ అని మోషన్ పోస్టర్‌తో చెప్పారు. ఇలాంటి కథని కామెడీ సినిమాగా మలచవచ్చు.. లేదా స్పూర్తిదాయకంగా మలచవచ్చు. దర్శకుడు కామెడీని ఎంచుకున్నట్లు మోషన్ పోస్టర్ స్పష్టం చేస్తోంది. 

శ్రీనాథ్ చంద్రశేఖర్ దర్శకత్వం చేస్తున్న ఈ సినిమాలో శివకుమార్ ధీకొండ, స్వప్న ప్రియదర్శిని, రవి శివతేజ, వంశీధర్, లోకేష్, బలగం సత్యనారాయణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

చంద్రయాన్‌ కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు, దర్శకత్వం: శ్రీనాథ్ చంద్రశేఖర్, సినిమాకు సంగీతం: హర్ష ప్రవీణ్, సినిమాటోగ్రఫీ: శ్రీనివాస్ బి, ఎడిటింగ్: పి.ఆర్. తేజ దాసరి,  

వేణు ఊడుగుల సమర్పణలో సింబా స్క్రీన్ స్టోరీస్ పతాకంపై ప్రవీణ్ మొలక ఈ సినిమా నిర్మిస్తున్నారు. 


Related Post

సినిమా స‌మీక్ష