గడ్డం పెంచితే సరిపోదు కేటీఆర్‌: ధర్మపురి అరవింద్

October 22, 2026


img

మాజీ మంత్రి, బీఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ తాజాగా ట్రిమ్ చేసిన గడ్డంతో కొత్త లుక్‌లో కనిపిస్తున్నారు. దీనిపై బిజేపి ఎంపీ ధర్మపురి అరవింద్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “ఇదివరకు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కూడా ఇలాగే కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చే వరకు గడ్డం గీయనని శపథం చేసి గడ్డం పెంచారు.

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆయన గడ్డం పెరిగింది కానీ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ బలపడలేకపోయింది. ఆయనను చూసి కేటీఆర్‌ కూడా గడ్డం పెంచడం మొదలుపెట్టినట్లున్నారు. కానీ ఇక బీఆర్ఎస్‌ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు.

వచ్చే ఎన్నికలలో బిజేపి గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి రాబోతోంది. ఇప్పటికే అందుకు గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కనుక కేటీఆర్‌ గడ్డం పెంచినా ఉపయోగం ఉండదు,” అని ధర్మపురి అరవింద్ అన్నారు. 

ఆయన కాంగ్రెస్‌-బీఆర్ఎస్‌ పార్టీల గురించి మరో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు. ఆ రెండు పార్టీలు పరస్పరం కాపాడుకుంటున్నాయని వాటి మద్య రహస్య అవగాహన ఉందని ధర్మపురి అరవింద్ ఆరోపించారు. అయితే దీనికి సిఎం రేవంత్‌ రెడ్డి అవరోధంగా ఉన్నారు కనుక కాంగ్రెస్‌ అధిష్టానం ఆయనను పక్కకు తప్పించవచ్చని అన్నారు. 

గతంలో ఇటువంటి ఆరోపణలను అందరూ కొట్టిపడేసేవారు. కానీ కాంగ్రెస్‌, ఇండియా కూటమి, సీజేపీ అధ్వర్యంలో జరుగుతున్న ఆందోళనలకు బీఆర్ఎస్‌ పార్టీ సంఘీభావం ప్రకటిస్తుండటం గమనిస్తే వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్‌-బీఆర్ఎస్‌ పార్టీల మద్య పొత్తులు కుదిరే అవకాశం ఉందనిపిస్తుంది. 


Related Post