గోవాలో రేవంత్ పాదయాత్ర.. జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ?

October 11, 2026


img

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు గోవాలో కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో జరుగుతున్న ‘గోయ్ రాఖోన్న్ యాత్ర’ పాదయాత్రలో పాల్గొంటున్నారు. అనంతరం అక్కడ జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమాలు ముగిసిన తర్వాత రాత్రికి ఢిల్లీ చేరుకుంటారు. 

గోవాలోని భూములు, పర్యావరణం, సంస్కృతి, వారసత్వం, స్థానిక గుర్తింపును కాపాడాలనే ఉద్దేశ్యంతో సెప్టెంబర్ 22న పనాజీలో ఈ యాత్ర ప్రారంభమైంది. మొత్తం 27 రోజులపాటు రాష్ట్రంలోని 40 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తూ సాగుతున్న ఈ యాత్ర అక్టోబర్ 18న ముగియనుంది. 

వచ్చే ఏడాది గోవా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ‘గోయ్ రాఖోన్న్ యాత్ర’కు కాంగ్రెస్‌ పార్టీ చాలా ప్రాధాన్యం ఇస్తోంది. ఈ యాత్ర ముగింపులో  సిఎం రేవంత్‌ రెడ్డిని కూడా ఆహ్వానించడం, దానిలో అయన పాల్గొని గోవా కాంగ్రెస్‌ నాయకులతో కలిసి నేడు పాదయాత్ర చేయడం చాలా ఆసక్తి కలిగిస్తుంది. 

తెలంగాణ ఏర్పడిన పదేళ్ళపాటు అధికారానికి దూరంగా ఉండిపోయిన కాంగ్రెస్ పార్టీని ఆయన అధికారంలోకి తెచ్చారు. అప్పటి నుంచి కాంగ్రెస్‌ అధిష్టానం దృష్టిలో అయనకు మంచి గుర్తింపు, ప్రాధాన్యం లభిస్తోంది.

ఇప్పుడు ఇతర రాష్ట్రాలలో జరిగే ఇటువంటి కాంగ్రెస్‌ కార్యక్రమాలకు ఆయనకు ఆహ్వానాలు అందుతుంటే, వాటిలో ఆయన స్థానిక కాంగ్రెస్‌ నాయకులతో కలిసి ఉత్సాహంగా పాల్గొంటున్నారు.

కనుక అయన క్రమంగా జాతీయ స్థాయి రాజకీయాలవైపు అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇతర రాష్ట్రాల కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులు తమతమ రాష్ట్రాలకే పరిమితం అవుతుంటే తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి మాత్రం తెలంగాణ రాజకీయాలను సమర్ధంగా నిర్వహిస్తూనే, జాతీయ స్థాయి రాజకీయాలలో క్లూడా చురుకుగా పాల్గొంటున్నారు.

కనుక భవిష్యత్‌లో అయన జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ పార్టీలో కీలక నాయకుడిగా ఎదగబోతున్నట్లే అనిపిస్తోంది.


Related Post