మేడ్చల్ జిల్లా బొల్లారంలోని కౌకూర్‌లో చిన్నారి కిడ్నాప్ ఘటన విషాదాంతమైంది. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. కౌకూర్‌లోని విల్లా ఆర్చిడ్స్ అపార్ట్‌మెంట్‌లో శనివారం రాత్రి చిన్నారి ఆడుకుంటూ కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో పోలీసులు అపార్ట్‌మెంట్‌లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. చిన్నారి చివరిసారిగా సెక్యూరిటీ గార్డు విక్రమ్‌తో కలిసి కనిపించినట్లు గుర్తించారు.
నిందితుడు గత రెండు రోజులుగా ఆ పాప తల్లితండ్రులు ఉంటున్న ఫ్లాట్ పరిసరాల్లో అనుమానాస్పదంగా తిరిగినట్లు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు గుర్తించారు.
చిన్నారిని కిడ్నాప్ చేసి ఆమె తల్లిదండ్రుల నుంచి 25 లక్షలు వసూలు చేయాలని నిందితుడు ప్రయత్నించాడు. కానీ పోలీసులకు పట్టుబడతాననే భయంతో అ చిన్నారిని హత్య చేసి మృతదేహాన్ని క్లబ్‌హౌస్ సెల్లార్‌లో పడేసినట్లు అనుమానిస్తున్నారు.
పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. అతడి మొబైల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా సికింద్రాబాద్ పరిసరాల్లో ఉన్నట్లు గుర్తించి గాలిస్తున్నారు. ఈ కేసులో ఆ గెటడ్ కమ్యూనిటీలో పనిచేసే సిబ్బందిని కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు.