తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిజిఎస్ఆర్‌టిసి)లో దాదాపు పదేళ్ళ తర్వాత శుక్రవారం జరిగిన గుర్తింపు యూనియన్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పోలింగ్ ముగిసిన అనంతరం వెలువడిన ప్రాథమిక ఫలితాల ప్రకారం, లెఫ్ట్ పార్టీల మద్దతు ఇచ్చిన ఎంప్లాయిస్ యూనియన్ (ఈయూ) కూటమి విజయం సాధించింది.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేసి ఈ ఎన్నికలు నిర్వహిస్తే, కాంగ్రెస్ మద్దతు గల తెలంగాణ వర్కర్స్ యూనియన్ (టిడబ్ల్యూయూ) ఓడిపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. దానిపై ఈయూ సుమారు 4,500 ఓట్ల మెజారిటీతో గెలిచింది.
రాష్ట్రవ్యాప్తంగా 98 డిపోలలో సాంప్రదాయ బ్యాలెట్ పేపర్ పద్ధతిలో శుక్రవారం నిర్వహించిన ఈ ఎన్నికల్లో, దాదాపు 35,000 మంది ఆర్టీసీ కార్మికులు చాలా ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఈ ఎన్నికలలో మొత్తం 12 సంఘాలు బరిలో నిలిచి హోరాహోరీగా పోరాడాయి. ‘ఈయూ’ రాష్ట్రవ్యాప్తంగా ఘన విజయం సాధించినప్పటికీ, గ్రేటర్ హైదరాబాద్ జోన్‌లో మాత్రం తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టిఎమ్‌యూ) తన పట్టును నిలబెట్టుకుంది.
ఇవి కేవలం ప్రాథమిక ఫలితాలు మాత్రమే. ఇంకా అంతర్ రాష్ట్ర సర్వీసులలో ఉన్న డ్రైవర్లు, కండక్టర్ల కోసం అక్టోబర్ 14, 15 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ నిర్వహించనున్నారు.
ఆ ఓట్లను కూడా లెక్కించిన అనంతరం కార్మిక శాఖ కమిషనర్ వచ్చే అక్టోబర్ 17, 2026న అధికారికంగా తుది ఫలితాలు, ఓట్ల శాతాన్ని ప్రకటిస్తారు. అయితే వారి సంఖ్య తక్కువే కనుక ఇవే అంతిమ ఫలితాలుగా భావించవచ్చు.