దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై నటి పూనమ్ కౌర్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన కుటుంబ పరిస్థితులను ఆసరాగా చేసుకుని తమతో ఓ ప్రకటన ఇప్పించారని ఆరోపించారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
తన కుటుంబం ద్వారా ఇప్పించిన ప్రకటనకు తాను కట్టుబడి ఉండబోనని పూనమ్ స్పష్టం చేశారు. రాజకీయ నాయకులు చేసిన పనులకు తమను బాధ్యులుగా చేయడం సరికాదని పేర్కొన్నారు. సమస్య వచ్చినప్పుడు దూరంగా వెళ్లిపోయి, అవసరం వచ్చినప్పుడు తిరిగి తమను ఉపయోగించుకోవడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు.
ఈ వ్యవహారంపై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎందుకు స్పందించడం లేదని ఆమె ప్రశ్నించారు. మరింతమంది అమాయకుల జీవితాలు దెబ్బతిన్న తర్వాతే చర్యలు తీసుకుంటారా? అంటూ అసోసియేషన్ తీరును నిలదీశారు.
మరో పోస్టులోనూ పూనమ్ పరోక్షంగా వేధింపుల అంశాన్ని ప్రస్తావించారు. ఒక వ్యక్తి మరణించినంత మాత్రాన గతంలో ఇతరులకు కలిగించిన బాధలు తొలగిపోవని, బాధితులు ఎదుర్కొన్న అనుభవాలు అబద్ధాలుగా మారిపోవని పేర్కొన్నారు.
ఒకరి మరణానికి సంతాపం తెలపడంతో పాటు, వారి వల్ల బాధపడినవారి అనుభవాలను కూడా గుర్తించాలని అభిప్రాయపడ్డారు.
త్రివిక్రమ్‌తో తనకు సంబంధించిన వివాదంపై పూనమ్ గతంలోనూ పలుమార్లు సోషల్ మీడియాలో స్పందించారు. తాజా వ్యాఖ్యలపై త్రివిక్రమ్ స్పందన వెలువడినట్లు సమాచారం లేదు.