బల్మూరికి కేటీఆర్‌ నోటీస్.. తప్పదా?

October 10, 2026


img

కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ బీఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఉద్దేశ్యించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న ఫోటోలు, సందేశాలు, విమర్శలు శృతి మించుతున్నట్లే ఉన్నాయి.

కేటీఆర్‌కు జ్వరం వచ్చి ఒంట్లో బాగోలేక మూడు రోజులుగా ఇంట్లో ఉండిపోతే, అయన మాదక ద్రవ్యాలు వాడుతారని, వైద్య పరీక్ష చేస్తే ఆ విషయం బయటపడకుండా ఉండేందుకు యశోదా హాస్పిటల్లో హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

కానీ సర్జరీ తర్వాత మొహంలో వాపు ఏర్పడటంతో, ఓ లండన్ వైద్యుడికి 5 కోట్లు ఇచ్చి, తన ఫామ్‌హౌసులోనే అయన చేత రహస్యంగా ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారని బల్మూరి వెంకట్ ‘ఎక్స్‌’లో పోస్టులు పెట్టారు. ఈ సందర్భంగా ఆయన ఓ సినీ నటి గురించి కూడా ప్రస్తావించారు. 

అయితే కేటీఆర్‌ తన కుమారుడు హిమాంషు కొరకు స్వయంగా కోడిగుడ్డు కూర తయారుచేస్తున్న ఫోటోలను ‘ఎక్స్‌’లో పోస్ట్ చేస్తూ బల్మూరి వెంకట్ ఆరోపణలు తప్పని చెప్పకనే చెప్పారు.

కానీ బల్మూరి వెంకట్ మాత్రం ఇక నుంచి కేటీఆర్‌ని రోజూ గోకుతూనే ఉంటానంటూ పెద్ద ట్వీట్‌ చేశారు. 

కాంగ్రెస్‌ ప్రతినిధిగా బీఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను రాజకీయంగా ఎదుర్కోవడం తప్పు కాదు. కానీ కేటీఆర్‌ వ్యక్తిగత వ్యవహారాలపై ఈవిధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ఆయనకే ప్రమాదం.

బల్మూరి వెంకట్ వద్ద ప్రతీ ఆరోపణకు సాక్ష్యాధారాలు ఉండి ఉండవచ్చు. కానీ ఓ రాజకీయ నాయకుడు హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేసుకోవడం, సినీ నటితో మాట్లాడటం, రాజకీయాలకు దూరంగా తన ఫామ్‌హౌసులోనే ఉండిపోవడం వంటివి చట్టరీత్యా నేరాలు కావు కదా?   

గతంలో ఈవిధంగా వ్యవహరించిన పలువురిపై కేటీఆర్‌, హరీష్‌ రావులు పరువు నష్టం దావా కేసులు వేశారు. బహుశః వెంకట్ బల్మూరికి కూడా త్వరలో నోటీస్ పంపినా ఆశ్చర్యం లేదు.

 


Related Post