ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటూ ఇండియా కూటమి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో చేపట్టిన ‘సేవ్ డెమోక్రసీ’ ర్యాలీ ఉద్రిక్తంగా మారింది.
కేంద్ర ఎన్నికల సంఘం తీరును నిరసిస్తూ, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం ఉదయం అధికార కాంగ్రెస్ పార్టీతో సహా ఇండియా కూటమిలో భాగస్వామ్య పార్టీల నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. నెక్లెస్ రోడ్ మీదుగా లోక్‌భవన్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
నెక్లెస్ రోడ్ వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లన దాటుకుని వారు ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు పలువురు తెలంగాణ మంత్రులను అదుపులోకి తీసుకున్నారు.
అరెస్ట్ అయిన వారిలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మహమ్మద్ అజారుద్దీన్ తదితరులున్నారు. పోలీసులు వారిని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. రాజ్యాంగబద్ధ సంస్థలను కేంద్రం నిర్వీర్యం చేస్తోందని, ప్రశ్నించే గొంతులను అణచివేసేందుకు ప్రయత్నిస్తోందని అరెస్టైన నాయకులు ఆరోపించారు.
కాంగ్రెస్, వామపక్ష కార్యకర్తలు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని తక్షణమే వారందరినీ విడుదల చేయాలంటూ నిరసన చేపట్టారు.