కేంద్ర ఎన్నికల కమీషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలంటూ మొన్న కాంగ్రెస్ అధ్వర్యంలో ఇండియా కూటమి ఢిల్లీలో చేసిన ర్యాలీలో పోలీసులు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీతో సహా పలువురు ముఖ్య నేతలను అరెస్ట్ చేశారు.
దీనిపై తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి చాలా తీవ్రంగా స్పందించారు. పోలీస్ స్టేషన్‌లో ఉన్న రాహుల్ గాంధీని పరామర్శించేందుకు అయన హుటాహుటిన ఢిల్లీకి వెళ్ళారు. కానీ పోలీసులు ఆయనను అనుమతించలేదు.
ఆయన ఈసీ, కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పోలీస్ స్టేషన్ బయట ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఓట్లను తొలగించేందుకే సర్ పేరుతో కుట్ర జరుగుతోంది. తక్షణం సర్ ప్రక్రియను నిలిపివేయాలని కాంగ్రెస్ పార్టీ తరపున నేను డిమాండ్ చేస్తున్నాను.
అలాగే నిబంధనల పేరుతో తొలగించిన అర్హులైన ఓట్లన్నింటినీ తిరిగి ఓటరు జాబితాలో చేర్చాలి. ఈ అవకతవకలకు అనుమతించిన కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తక్షణం రాజీనామా చేయాలి. మా ఈ రెండు డిమాండ్లు నెరవేరేవరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుంది.
జ్ఞానేశ్ కుమార్ చేత కేంద్ర ప్రభుత్వం వెంటనే రాజీనామా చేయించకపోతే రాజకీయంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం, ఈసీ రెండూ కలిసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయి. దేశ ప్రజలు బిజేపిని ఎప్పటికీ క్షమించరు,” అని సిఎం రేవంత్ రెడ్డి విమర్శించారు.