కోదండరాంకే మళ్ళీ జనసమితి పగ్గాలు

October 07, 2026


img

ఒకప్పుడు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ప్రొఫెసర్ కోదండరాం, తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రాధాన్యం కోల్పోయారు. కారణాలు అందరికీ తెలుసు.

ఆ తర్వాత తెలంగాణ జన సమితి పేరుతో రాజకీయ పార్టీ పెట్టుకున్నారు కానీ ఎన్నికల్లో ప్రభావం చూపలేకపోయారు. అయితే తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి సంపాదించుకున్నారు. అంతకు మించి రాజకీయంగా అయన, జనసమితి సాధించింది ఏమీ కనపడదు. 

ఉద్యమాలలో చురుకుగా పాల్గొన్న ఆయన, రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత తప్పకుండా మళ్ళీ యాక్టివ్ అవుతారనుకుంటే, చాలా అరుదుగా కనబడుతుంటారు. కనుక రాష్ట్రంలో తెలంగాణ జనసమితి అనే ఓ పార్టీ ఉందా లేదా? అనే అనుమానం కలుగుతుంది.  

ఈ నేపధ్యంలో ప్రొఫెసర్ కోదండరాం మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్టీకి కొత్త కార్యవర్గాన్ని కూడా ప్రకటించారు. మరి ఈసారి కథ మారుతుందా? లేక కోదండరాం నేతృత్వంలో తెలంగాణ జన సమితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉండిపోతుందా? అంటే ఓటర్ల జాబితా సవరణ, ఎన్నికల సంఘం వ్యవహారాలపై కోదండరాం గట్టిగానే స్పందిస్తున్నారు. టీజేఎస్ ఆధ్వర్యంలో నిరసనలకు కూడా పిలుపునిస్తున్నారు. కనుక పార్టీలో కాస్త రాజకీయ కదలిక వచ్చినట్లే కనిపిస్తోంది. 

పార్టీకి నాయకత్వ సమస్య లేకపోయినా.. పార్టీని బలమైన రాజకీయ శక్తిగా మార్చడమే అసలు సవాల్.


Related Post