గ్రీన్ ఎస్ఎం సంస్థ (అద్దె) కార్లు ఇప్పటికే ఢిల్లీలో సేవలు అందిస్తోంది. బెంగళూరులో నడిపించేందుకు ఇటీవలే అనుమతి పొందింది. త్వరలో హైదరాబాద్‌లో సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీనిపై ఆటో, క్యాబ్ డ్రైవర్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ సంస్థకు కేవలం రూ.30,000 సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించి కారు పొందవచ్చు. దాంతో ఆ సంస్థ నుంచి వారానికి రూ.8,000 లేదా నెలకు రూ.35,000 వరకు జీతం అందుకోవచ్చు. కనుక ఇది తమ వంటి పేదలకు గొప్ప అవకాశం అని కొందరు అభిప్రాయపడుతున్నారు.
అయితే మరికొందరు ఏమంటున్నారంటే, ఈవిధంగా అందరినీ ప్రలోభపెట్టి చేర్చుకుని ఉద్యోగులుగా చేరాల్సిన పరిస్థితి కల్పిస్తోంది. దాంతో పోటీ పడి ఛార్జీలు తగ్గించలేక నగరంలో షేరింగ్ ఆటోలు, క్యాబ్‌లు తిప్పడం మానుకోవాల్సిన పరిస్థితి కల్పిస్తోందని అంటున్నారు.
ఇక వారిని దెబ్బ తీస్తున్న ర్యాపిడో, ఊబర్, ఓలా వంటి సంస్థలు కూడా మూతపడే పరిస్థితి కలుగవచ్చు. అద్దెకు బైకులు, స్కూటీలు, కార్లు తెచ్చుకొని నడిపిస్తున్నవారు, అప్పు చేసి వాహనాలు కొని వాటి వాయిదాలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నవారు, ప్రతీ ట్రిప్పుకు ఇంత చొప్పున ఆ సంస్థలు ఇచ్చే కమీషన్లు సరిపోక ఇబ్బంది పడుతున్నవారికి గ్రీన్ ఎస్ఎం సంస్థలో చేరిపోవచ్చు.
హైదరాబాద్‌లో ఈ గ్రీన్ ఎస్‌ఎంకు అనుమతించడంపై బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏమన్నారంటే, “2016లో జియో కంపెనీ ఫ్రీ డేటా, ఫ్రీ కాల్స్ అనే ఆఫర్‌తో ఎయిర్‌సెల్, టాటా డొకోమో, రిలయన్స్ టెలికమ్యూనికేషన్స్ వంటి వాటిని దెబ్బ తీసింది.
ఆ తర్వాత కోట్ల మంది కస్టమర్లు వచ్చిన తర్వాత మెల్లమెల్లగా జియో ఛార్జ్ షీట్ ధరలు రేట్లు పెంచడం మొదలు పెట్టింది. ఇప్పుడు దానికి ఒక్క ఎయిర్ టెల్ తప్ప మరెవరూ పోటీ లేరు. కనుక ఇష్టం వచ్చినట్లు చార్జీలు పెంచుకుంటోంది. ఇప్పుడు గ్రీన్ ఎస్ఎం కూడా సరిగ్గా అదే చేయబోతోంది.
ఆటో డ్రైవర్లను, క్యాబ్ డ్రైవర్లను బంద్ చేయించి పోటీ లేకుండా చేసుకుంటుంది. వారందరూ ఆ సంస్థలో చేరిన తర్వాత మెల్లమెల్లగా వారికి ఇచ్చే జీతం తగ్గిస్తుంది. పోటీ ఉండదు కనుక అప్పుడు ఛార్జీలు కూడా పెంచుకుంటుంది. ఆటో డ్రైవర్ల, క్యాబ్ డ్రైవర్ల పొట్ట కొట్టాలని ప్రయత్నిస్తున్న గ్రీన్ సిగ్నల్ ఎస్ఎం కంపెనీకి ఈ ప్రభుత్వం ఎందుకు అనుమతిస్తోంది?” అని ప్రశ్నించారు.