హైదరాబాద్ నగరంలో ఇప్పుడు గజం భూమి ధర లక్షలు పలుకుతోంది. కనుక కబ్జాలకు గురైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవడం చాలా చాలా కష్టం. కానీ ‘హైడ్రా సంస్థ’ అనేక విమర్శలు, రాజకీయ ఒత్తిళ్ళు, కోర్టులో చివాట్లు అన్నిటినీ భరిస్తూ ప్రభుత్వ భూములను, చెరువులను స్వాధీనం చేసుకుంటోంది.
అటువంటిదే హైటెక్ సిటీ పక్కనే ఉన్న తమ్మిడికుంట చెరువు కూడా. పలుకుబడి గల ప్రముఖులు, రియల్ ఎస్టేట్ సంస్థలు, నిరుపేదల ఆక్రమణలతో 30 ఎకరాల ఆ చెరువు 14 ఎకరాలకు కుచించుకుపోయింది.
కానీ సిఎం రేవంత్ రెడ్డి అండగా నిలబడటంతో హైడ్రా కమీషనర్ రంగనాథ్ ధైర్యంగా ఈ ఒత్తిళ్ళన్నీ తట్టుకొంటూ తమ్మిడికుంట చెరువు కబ్జాల నుంచి విముక్తి కల్పించారు.
అయితే అక్కడితో పని అయిపోయిందనుకోలేదు. సిఎం రేవంత్ రెడ్డి సూచన మేరకు దానిని అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు.
ముందుగా చెరువులో పేరుకుపోయిన చెత్త, వ్యర్ధాలు, గుర్రపు డెక్క మొక్కలు తొలగింపజేశారు. తర్వాత చెరువులోకి వర్షం నీరు చేరుకునే పైపులన్నిటినీ క్లియర్ చేయించారు. చెరువు చుట్టూ పచ్చటి చెట్లు, మొక్కలతో పచ్చదనం పెంచారు. అలాగే వాక్ వేలు నిర్మింపజేశారు.
నగర ప్రజలు సేద తీరేందుకు చెరువు చుట్టూ అందమైన పార్కులు నిర్మించారు. పునరుజ్జీవనం అంటే ఏవిధంగా ఉంటుండో తమ్మిడికుంట చెరువుతో చేసి చూపించారు.
ఈ చెరువు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, నటుడు నాగార్జున అందరూ హైడ్రా కమీషనర్ రంగనాథ్‌ను మనస్పూర్తిగా అభినందించారు.
ఇదే స్పూర్తితో నగరంలో కబ్జాలకు గురైన మిగిలిన చెరువులను కూడా సుందరీకరణ చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని సిఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇప్పుడు ఐటి కంపెనీల ఉద్యోగులు పార్కులో కూర్చొని ‘వర్క్ ఫ్రం తమ్మిడికుంట చెరువు’ అంటూ ఆహ్లాదకరమైన వాతావరణంలో హాయిగా పనిచేసుకోగలరని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు.
ఇదేవిధంగా మూసీనదిని కూడా ప్రక్షాళన చేస్తామని, పర్యాటకులను ఆకర్షించేవిధంగా తీర్చి దిద్దుతామని, నదీ పరివాహక ప్రాంతంలో రాత్రిపూట వ్యాపారాలు చేసుకునేందుకు అనుమతిస్తామని సిఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
14 ఎకరాలున్న తమ్మిడికుంట చెరువును 30 ఎకరాలకు విస్తరించినం. ఈ చెరువు అభివృద్ధి కోసం నాగార్జున గారు రెండు ఎకరాల భూమిని ఇచ్చారు. అందుకే ఈ కార్యక్రమానికి వారిని ముఖ్య అతిథిగా పిలిచి సత్కరించడం జరిగింది.
: ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి,
▪️ తమ్మిడికుంట చెరువు ప్రారంభోత్సవ కార్యక్రమం,
📍 మాదాపూర్, హైదరాబాద్.