డిసెంబర్‌లో తెలంగాణ గ్లోబల్ సమ్మిట్

November 11, 2026
img

తెలంగాణలో పెట్టుబడులు, పారిశ్రామిక అభివృద్ధి, యువతకు ఉద్యోగ అవకాశాలే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 7 నుంచి 9 వరకు హైదరాబాద్‌లోని భారత్ ఫ్యూచర్ సిటీలో 'ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026' నిర్వహించనుంది. ఈ సదస్సుకు దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో 550కి పైగా ప్రముఖ కంపెనీలను ఆహ్వానించింది.

ఈ మూడు రోజుల సదస్సులో నాలుగు ప్రధాన వేదికలపై మొత్తం 52 సమావేశాలు నిర్వహించనున్నారు. రక్షణ, ఏరోస్పేస్, ఫార్మా, లైఫ్ సైన్సెస్, విద్య, వ్యవసాయం, స్టార్టప్‌లు, సాంకేతిక రంగాలకు ఇందులో ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వనున్నారు.

ముఖ్యంగా రక్షణ రంగానికి సంబంధించిన 'రక్షా ఎక్స్‌పో' ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇందులో అంతరిక్షం, ఏరోస్పేస్, డ్రోన్లు, రోబోటిక్స్, సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన సాంకేతికతలను ప్రదర్శించనున్నారు.

అలాగే యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ రంగాలకు సంబంధించి 'ఇండియా జాయ్' కార్యక్రమాన్ని కూడా నిర్వహించనున్నారు. స్టార్టప్ కంపెనీలు తమ నూతన ఆవిష్కరణలను ప్రపంచ పెట్టుబడిదారులకు పరిచయం చేసేందుకు ఈ సదస్సు వేదిక కానుంది.

ఈ సదస్సు ప్రధాన ఉద్దేశం పరిశ్రమలు, పెట్టుబడులను ఆకర్షించడమే అయినప్పటికీ.. తెలంగాణ సంస్కృతి, చరిత్ర, పర్యాటక ప్రాంతాలు, కళారూపాలను అంతర్జాతీయ ప్రతినిధులకు పరిచయం చేసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. తద్వారా పర్యాటక రంగంలోనూ పెట్టుబడులను ఆకర్షించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

తెలంగాణ రైజింగ్-2047 లక్ష్యంలో భాగంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల స్థాయికి తీసుకెళ్లాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్య సాధనకు రూపొందించిన ప్రణాళికలు, కార్యాచరణను సదస్సుకు హాజరయ్యే దేశవిదేశీ ప్రతినిధులకు వివరించనున్నారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఈ సదస్సు ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఉన్నతాధికారులతో సమావేశాలు నిర్వహిస్తూ ఏర్పాట్ల పురోగతిని స్వయంగా సమీక్షిస్తున్నారు.

Related Post