రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డికి ఆరు నెలల జైలు శిక్ష పడింది. కోర్టు ధిక్కరణ కేసు విచారణ చేపట్టిన హైకోర్టు ఆయనకు ఆరు నెలల సాధారణ జైలు శిక్షతో పాటు రూ.2,000 జరిమానా విధించింది. అయితే అప్పీల్ చేసుకునేందుకు వీలుగా నాలుగు వారాల పాటు శిక్ష అమలును నిలిపివేస్తూ వెంటనే మరో ఉత్తర్వులు కూడా జారీ చేసింది.
తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని మన్నె ముత్యాలమ్మ కుంట గ్రామంలో సర్వే నంబర్లు 536, 537, 657, 658లో ఉన్న ప్లాట్లను నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించి, వాటికి ఎన్వోసీ జారీ చేయాలని పలువురు హైకోర్టును ఆశ్రయించారు.
కనీ అధికారులు తమ దరఖాస్తులను పరిశీలించకుండా పెండింగ్లో ఉంచుతున్నారని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ఈ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు.. సదరు ప్లాట్లను నిషేధిత జాబితా నుంచి తొలగించాలన్న వినతులను పరిశీలించాలని అధికారులను ఆదేశించింది.
ఒకవేళ ఆ అభ్యర్థనలను అంగీకరించకపోతే అందుకు గల కారణాలను వివరిస్తూ 60 రోజుల్లోగా ఉత్తర్వుల ప్రతులను పిటిషనర్లకు అందించాలని స్పష్టం చేసింది.
అయితే కోర్టు విధించిన గడువులోగా కలెక్టర్ ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. దీంతో పిటిషనర్లు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై జస్టిస్ కె. లక్ష్మణ్ ధర్మాసనం విచారణ చేపట్టి కలెక్టర్కు ఆరు నెలల జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది.