దీపావళి కానుక కాదు.. మోసం జర భద్రం: సజ్జనార్

November 07, 2026
img

దీపావళి పండుగను కూడా సైబర్ నేరగాళ్లు తెలివిగా వాడేసుకుంటున్నారు. పేటీఎం సంస్థ దీపావళి కానుకగా ప్రతి ఒక్కరికీ రూ.1,000 నగదు అందిస్తోందంటూ వాట్సాప్, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో నకిలీ సందేశాలు వైరల్ చేస్తున్నారు. 

ఈ సందేశాలను నమ్మి ఆ లింకులపై క్లిక్ చేస్తే వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలు తస్కరించే ప్రమాదం ఉందని హైదరాబాద్ పోలీసులు హెచ్చరించారు.

ఈ నకిలీ సందేశాల్లో ప్రజలకు నమ్మకం కలిగించేలా మరో వ్యూహాన్ని కూడా ఉపయోగిస్తున్నారు. “మొదట ఇది ఫేక్ అనుకున్నా.. కానీ నిజంగానే నాకు రూ.1,000 వచ్చాయి. మీరు కూడా ప్రయత్నించండి,” అంటూ కొందరు దీపావళి కానుకగా వెయ్యి రూపాయలు పొందినట్లు సందేశాలు జత చేస్తున్నారు. 

వీటిని చూసిన ప్రజలు నిజమేనని నమ్మి లింకులపై క్లిక్ చేసేలా సైబర్ క్రైమ్‌ మోసగాళ్ళు. ఆ తర్వాత వాళ్ళు ప్రజల వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ వివరాలు సేకరించి దోచుకుంటున్నారని, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ప్రజలను అప్రమత్తం చేశారు. 

కనుక అనుమానాస్పద లేదా ఇలా ఊరించే లింకులపై క్లిక్ చేయవద్దని, బ్యాంకు ఖాతా వివరాలు, ఏటీఎం పిన్, ఓటీపీ, పాస్‌వర్డ్‌లను ఎవరితోనూ పంచుకోవద్దని సూచించారు. ఇలాంటి సందేశాలను నిజానిజాలు తెలుసుకోకుండా ఇతరులకు ఫార్వార్డ్ చేయవద్దని తెలిపారు.

పేటీఎం ఆఫర్ల గురించి తెలుసుకోవాలంటే సంస్థ అధికారిక వెబ్‌సైట్ లేదా గుర్తింపు పొందిన కమ్యూనికేషన్ మార్గాల ద్వారానే ధృవీకరించుకోవాలని సజ్జనార్ సూచించారు. 

ఒకవేళ సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయాలని లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని కోరారు.

Related Post