నల్గొండకు చెందిన శ్రీజ రెడ్డి కోయ అమెరికాలోని బోస్టన్‌లో యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్‌లో చదువుకుంటోంది. నవంబర్ 2వ తేదీ రాత్రి నుంచి ఆమె కనిపించకుండా పోయింది. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
బోస్టన్‌లోని డోర్చెస్టర్ ప్రాంతం ఎడిసన్ గ్రీన్‌లో నివసిస్తున్న ఆమె ఆరోజు రాత్రి నైట్ వాక్‌కు వెళ్లి తిరిగి రాలేదు. ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు అక్కడే ఉంటున్న ఆమె స్నేహితుల ద్వారా బోస్టన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆమె అదృశ్యమైనట్లు అధికారిక ప్రకటన విడుదల చేశారు.
శ్రీజ సెల్‌ఫోన్ చివరి సిగ్నల్ ఆధారంగా బోస్టన్ పోలీసులు కార్సన్ బీచ్, హార్బర్ పాయింట్ ప్రాంతాల్లో ఆమె కోసం గాలిస్తున్నారు.
నల్గొండ జిల్లా కనగల్ మండలం శాబ్దులాపురం గ్రామానికి చెందిన ఆమె తల్లిదండ్రులు కోయ యాదగిరి రెడ్డి, రూప దంపతులు నాలుగు రోజులైనా కుమార్తె ఆచూకీ తెలియకపోవడంతో కన్నీరుమున్నీరవుతున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వారితో ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పారు.
తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీజ (23) వారికి ఏకైక కుమార్తె. ఏడాది క్రితం ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన ఆమె అక్కడ చదువుకుంటూనే పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తోంది. చదువు పూర్తయ్యాక వివాహం చేయాలని తల్లిదండ్రులు సంబంధాలు కూడా చూస్తున్నారు. అయితే నాలుగు రోజులుగా ఆమె ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ఆమె ఎక్కడికి వెళ్లింది? ఏదైనా ప్రమాదంలో చిక్కుకుందా? అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు ఆమె కోసం గాలింపు కొనసాగిస్తున్నారు.