రైతు భరోసా నిధులు జమా: లక్షల మందికి నకిలీ మెసేజ్‌లు?

November 05, 2026


img

తాజా సమాచారం ప్రకారం తెలంగాణలో రైతు భరోసా నిధులు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అయినట్లు నకిలీ మెసేజ్‌లు వస్తున్నట్లు తెలుస్తోంది. అదీ సీఎం రేవంత్ రెడ్డి పేరుతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.73 లక్షల మంది రైతులకు ఈ సందేశాలు వచ్చినట్లు తెలుస్తోంది. 

రైతు భరోసా పథకం కింద ఎకరానికి ఏడాదికి రూ.12 వేల చొప్పున అందించే మొత్తంలో భాగంగా తమ ఖాతాల్లో డబ్బులు జమ అయినట్లు రైతులకు మెసేజ్‌లు వచ్చాయి. కొందరికి రూ.7,500 జమ అయినట్లు సందేశాలు అందాయి. దీంతో రైతులు తమ బ్యాంకు ఖాతాలను పరిశీలించగా ఎలాంటి నగదు జమ కాలేదని గుర్తించారు.

ఈ వ్యవహారంపై స్పందించిన వ్యవసాయ శాఖ.. తాము ఎలాంటి సందేశాలు పంపలేదని, వాటిని పంపేందుకు ఎవరికీ అనుమతి ఇవ్వలేదని తెలిపింది. 

వ్యవసాయ శాఖ డైరెక్టర్ బి. గోపి ఈ విషయంపై డీజీపీకి లేఖ రాశారు. సుమారు 2,73,128 మంది రైతులకు అనధికారికంగా మెసేజ్‌లు వెళ్లినట్లు సీడీఏసీ పోర్టల్ నివేదికలో గుర్తించినట్లు పేర్కొన్నారు.

వ్యవసాయ శాఖ అధికారిక సమాచారాన్ని పంపేందుకు సీడీఏసీ ఎస్ఎంఎస్ సర్వీస్ పోర్టల్‌ను వినియోగిస్తోంది. అయితే ఈ సందేశాలు ఆ పోర్టల్ ద్వారా పంపినవి కావని అధికారులు తెలిపారు. శాఖ పేరును దుర్వినియోగం చేసి ఇతర ఎస్ఎంఎస్ గేట్‌వేల ద్వారా సందేశాలు పంపి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. కనుక రైతులు ఇలాంటి తప్పుడు సందేశాలను నమ్మవద్దని, అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని అధికారులు సూచించారు. బ్యాంకు వివరాలు, ఓటీపీలు, వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ వెల్లడించవద్దని హెచ్చరించారు.

ఈ మెసేజ్‌లు ఎక్కడి నుంచి వచ్చాయి? వాటిని పంపిన వ్యక్తులు లేదా సంస్థలు ఎవరు? అనే అంశాలపై విచారణ జరిపించాలని వ్యవసాయ శాఖ కోరింది. డీజీపీ సీవీ ఆనంద్‌ను కోరినట్లు తెలుస్తోంది. 


Related Post