ఇటీవల మృతి చెందిన ఆర్టీసీ కండక్టర్ గుండ్ల ప్రవళికకు మణుగూరు ఆర్టీసీ డిపోలో సాటి ఉద్యోగులు, కుటుంబ సభ్యులు కన్నీటి వీడ్కోలు పలికారు.
అందరితో కలిసిపోయే స్నేహశీలి అయిన ఆమె ఈ విధంగా మరణించిందంటే నమ్మలేకపోతున్నామని, చాలా బాధగా ఉందంటూ తోటి ఉద్యోగులు కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రవళిక మృతదేహం వద్ద ఆమె తల్లి విజయలక్ష్మి కన్నీరుమున్నీరుగా విలపించారు.
పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, కార్మిక సంఘం నాయకుడు రాంబాబు, వామపక్షాలతో సహా వివిధ సంఘాల నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రవళికకు నివాళులర్పించారు.
గత నెల 25న మణుగూరు నుంచి భద్రాచలం వెళ్తున్న బస్సులో టికెట్ చిల్లర విషయంలో ప్రయాణికురాలు బానోతు మౌనికతో ప్రవళికకు గొడవ జరిగింది. ఈ క్రమంలో మిట్టగూడెం వద్ద ఆమెను కదులుతున్న బస్సులో నుంచి తోసేయడంతో వెనుక చక్రాలు ప్రవళిక కాళ్లపై నుంచి వెళ్లాయి.
తీవ్రంగా గాయపడిన ప్రవళికను తొలుత భద్రాచలం ఆస్పత్రికి, అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. పది రోజుల పాటు చికిత్స పొందిన ఆమె నవంబర్ 3న రాత్రి మృతి చెందింది.
ఆర్టీసీ ఉద్యోగులు, కుటుంబ సభ్యులు ఆమె అంతిమయాత్ర నిర్వహించారు. మణుగూరు శివారులోని కట్టుమల్లారం వద్ద ఈరోజు ఉదయం అంత్యక్రియలు పూర్తి చేశారు.
ప్రవళిక మృతికి నిరసనగా ఖమ్మం రీజియన్లో ఆర్టీసీ ఉద్యోగులు విధులు బహిష్కరించి బస్సుల బంద్ నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ప్రవళికపై దాడికి పాల్పడిన బానోతు మౌనికపై పోలీసులు హత్య కేసు నమోదు చేశారు.