బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తరచూ తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డిని పలు అంశాలపై సూటిగా ప్రశ్నిస్తూనే ఉంటారు. విమర్శిస్తూనే ఉంటారు. బహుశః వాటికి కాంగ్రెస్ నేతలు కూడా అలవాటు పడిపోయారేమో వాటిని పెద్దగ పట్టించుకోరు . ఇప్పుడు కేటీఆర్ నేరుగా ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలనే సూటిగా ఓ ప్రశ్న అడిగారు.
ఇటీవల అమిత్ షా హైదరాబాద్‌లో జరిగిన బిజేపి పాదయాత్రలో పాల్గొన్నప్పుడు మాట్లాడుతూ, “ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఏటీఎంగా మార్చేసుకొని డబ్బు దండుకుంటోంది. అలా దండుకున్న డబ్బు మూటలను ఈ సీఎం ఢిల్లీలో తమ అధిష్టానానికి సమర్పించుకుంటూ తన పదవి కాపాడుకుంటున్నారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలో తెలంగాణను దోచుకుతిన్నాయి. వచ్చే ఎన్నికలలో ఈ రెండు పార్టీలను కూకటివేళ్ళతో పెకలించి వేస్తాం. వాటి నుంచి తెలంగాణ రాష్ట్రానికి, ప్రజలకు విముక్తి కల్పిస్తాం. బిజేపి మాత్రమే నిజాయితీగా పనిచేస్తుంది. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగల శక్తి, నిబద్దత ఒక్క బిజేపికి మాత్రమే ఉంది,” అని అమిత్ షా అన్నారు.
ఈ వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందిస్తూ, “ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకుంటోందని, తెలంగాణ ప్రజల సొమ్ముని సిఎం రేవంత్ రెడ్డి తన అధిష్టానానికి సమర్పించుకుంటున్నాడని ప్రధాని మోడీ, అమిత్ షాలు స్వయంగా చెపుతున్నప్పుడు, మరి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? కాంగ్రెస్-బిజేపిల మధ్య రహస్య అవగాహన ఉన్నందునేనా?లేకుంటే చర్యలు తీసుకోవాలి కదా?” అని సూటిగా ప్రశ్నించారు.