తెలంగాణలో కరువు పరిస్థితులు, విద్యుత్ సమస్యలపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు.
ఎల్‌నినో ప్రభావంతో కరువు వచ్చే అవకాశం ఉందని ఆరు నెలలుగా చెబుతున్న ప్రభుత్వం, కృష్ణా, గోదావరి నదుల నుంచి నీటిని జలాశయాల్లో ఎత్తిపోసి ఎందుకు నిల్వచేయలేదని హరీష్ రావు ప్రశ్నించారు.
పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో కరువు పరిస్థితులు లేకుండా అక్కడి ప్రభుత్వం ముందే అన్ని జాగ్రత్తలు తీసుకుంది కానీ దానికి ఎగువన ఉన్న తెలంగాణలో నీళ్ళు లేక కరువు పరిస్థితి ఏర్పడింది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించిన కరువు. దాని అసమర్ధత, నిర్లక్ష్యం కారణంగానే రాష్ట్రంలో కరువు పరిస్థితి నెలకొందని హరీష్ రావు ఆరోపించారు.
రాష్ట్రంలో విద్యుత్ కొరత లేదని, విద్యుత్ వినియోగం పెరిగిందని ప్రభుత్వం అబద్దాలు చెపుతోంది. కరెంట్ కోతలతో బోర్లు నడవక, పంటలకు నీళ్ళు అందక ఎండిపోతున్నాయని హరీష్ రావు ఆరోపించారు. రైతులు పంటలను కాపాడుకునేందుకు ట్యాంకర్లతో నీటిని అందించాల్సిన దయనీయ పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఒకవేళ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే ముందుగానే నీటిని నిల్వ చేసి కరువు పరిస్థితులు రాకుండా చర్యలు తీసుకునేవారని అన్నారు. విద్యుత్ కోతలు లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేసేవారని హరీశ్ రావు పేర్కొన్నారు.
కనుక ఇప్పటికైనా సిఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ మంత్రులు మాపై వ్యక్తిగత విమర్శలు మానుకుని, ముందుగా ప్రజలకు నీరు, విద్యుత్, రైతులకు సాగునీరు అందించడంపై దృష్టి పెట్టాలని హరీష్ రావు హితవు పలికారు.
రాష్ట్రంలోని ప్రాజెక్టుల వారీగా నీటి నిల్వలు, తాగునీటి అవసరాలు, సాగునీటి లభ్యత, కరువు నివారణకు కేటాయించిన నిధుల వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని హరీశ్ రావు కోరారు.
కరువు ప్రభావంతో నష్టపోయిన రైతులకు తక్షణ పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. రైతు బీమా, పంటల బీమా పథకాలను అమలు చేయడంతో పాటు ప్రజలకు తాగునీరు, పశువులకు పశుగ్రాసం, గ్రామీణ కూలీలకు ఉపాధి కల్పించాలని హరీష్ రావు ప్రభుత్వాన్ని కోరారు.