తెలంగాణలో సన్న వడ్ల సాగు అంశంపై మళ్ళీ కాంగ్రెస్-బీఆర్ఎస్ పార్టీల మద్య వాదోపవాదాలు మొదలయ్యాయి. సన్న వడ్లు సాగు చేయాలని ప్రభుత్వం సూచించినప్పుడు కేటీఆర్, హరీశ్ రావు విమర్శలు చేశారని, ఇప్పుడు మార్కెట్లో సన్న వడ్లకు డిమాండ్ పెరిగినప్పుడు వాటికి ప్రభుత్వం నీళ్ళు ఎందుకు అందించలేదని విమర్శిస్తున్నారని సిఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎల్‌నినో ప్రభావం కేవలం తెలంగాణ రాష్ట్రం మీద మాత్రమే కాదు యావత్ ప్రపంచ దేశాలపై కూడా ఉందనే విషయం మా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న బీఆర్ఎస్ నేతలకు తెలియదా? అని సిఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. వచ్చే ఏడాది జూలై వరకు ఎల్‌నినో ప్రభావం ఉంటుందని వాతావరణ నిపుణులు చెపుతున్నారని, కనుక అంతవరకు నీటికి, విద్యుత్‌కి ఇబ్బందులు ఉంటాయి కనుక ప్రజలు, రైతులు వాటిని పొదుపుగా వాడుకోవాలని సిఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
ఈ వాస్తవాలను దాచి పెట్టడం క్యాన్సర్ వ్యాధిని దాచిపెట్టడం వంటిదే అవుతుంది కనుక మంత్రులు, కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు అందరూ హైదరాబాద్ వదిలి తమతమ జిల్లాలు, నియోజకవర్గాలకు వెళ్ళి ఎల్‌నినో ప్రభావం గురించి ప్రజలను చైతన్య పరచాలని సిఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
బీఆర్ఎస్ పార్టీ అవినీతికి నిలువెత్తు నిదర్శనంగా యాదాద్రి పవర్ ప్లాంట్ నిలుస్తుందని, ప్రతిమా శ్రీనివాస్‌కు భారీగా దోచిపెట్టేందుకే మిర్యాలగూడలో ప్లాంట్ కట్టారని సిఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు.
తెలంగాణ ఏర్పడ్డాక నీళ్ళు బీఆర్ఎస్ నేతల ఫామ్‌హౌసులకు, నిధులు బీఆర్ఎస్ పార్టీ ఖాతాకు, నియామకాలు కల్వకుంట్ల కుటుంబానికి దక్కాయని సిఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు.