తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం సింగరేణి ప్రాంతాలకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. పార్టీ అనుబంద కార్మిక సంఘం తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకెఎస్) నేతలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
వారితో సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి కేటీఆర్ సుదీర్గంగా చర్చించారు. సింగరేణి సంస్థను ప్రైవేటీకరణ చేసేందుకు కాంగ్రెస్, బిజేపిలు చేస్తున్న ప్రయత్నాలను బీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటుందని కేటీఆర్ వారికి హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సింగరేణి సంస్థను, కార్మికులను కడుపులో పెట్టుకొని కాపాడుకుందని, కానీ కాంగ్రెస్, బిజేపిలు కలిసి సింగరేణిని దెబ్బ తీస్తున్నాయని కేటీఆర్ అన్నారు.
సింగరేణిలో జరుగుతున్న అవకతవకలు, అక్రమాలను అడ్డుకోకపోతే ముందుగా సంస్థ, తర్వాత దానిపై ఆధారపడిన కార్మికులు తీవ్రంగా నష్టపోతారని కేటీఆర్ అన్నారు.
సింగరేణిలో ‘టీబీజీకెఎస్’ బలంగా ఉన్నంతకాలం సింగరేణి జోలికి ఎవరూ రాలేరని కనుక త్వరలో జరుగబోయే గుర్తింపు సంఘం ఎన్నికలలో ‘టీబీజీకెఎస్’ను గెలిపించుకునేందుకు అందరూ కలిసికట్టుగా పోరాడాలని కేటీఆర్ సూచించారు.