బోర్ వేస్తున్నారా? అయితే లక్ష జరిమానా!

October 22, 2026
img

ఎల్‌ఎల్‌నినో.. వర్షాభావ పరిస్థితి కారణంగా హైదరాబాద్‌లో భూగర్భ జలాలు వేగంగా అడుగంటిపోతున్నాయి.

మరోపక్క నగరంలో అనేక భారీ బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు జోరుగా సాగుతూనే ఉన్నాయి. వాటిలో డజన్ల కొద్దీ బోర్లు వేస్తూనే ఉన్నారు.

తాజా సమాచారం ప్రకారం ఒక్క హైదరాబాద్‌ నగరంలోనే అధికారిక రికార్డుల్లో మాత్రం 2.43 లక్షల బోర్లు ఉన్నట్లు నమోదు కాగా, అనధికారికంగా 13 నుంచి 15 లక్షల వరకు బోర్లు ఉన్నట్లు అంచనా.

ఇక నిబంధనలకు విరుద్దంగా రోజుకు సగటున 200కు పైగా కొత్త బోర్లు తవ్వుతుండగా, మరోపక్క రోజుకు వంద బోర్లు ఎండిపోతున్నట్లు తెలుస్తోంది. 

కొండాపూర్‌, బంజారాహిల్స్‌, బండ్లగూడ జాగీర్‌ వంటి ప్రాంతాల్లో 400 అడుగుల పరిమితిని దాటి బోర్లు తవ్వుతున్నట్లు అధికారులు గుర్తించారు. కొన్ని చోట్ల 1,000 అడుగులకు మించి తవ్వకాలు జరుగుతున్నాయి. భూగర్భంలోకి చేరుతున్న నీటి కంటే ఎక్కువగా తోడేస్తుండటంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది.

రోజురోజుకూ పెరుగుతున్న నీటి అవసరాలతో హైదరాబాద్‌లో భూగర్భ జలాలపై ఒత్తిడి పెరుగుతోంది. కనుక రాష్ట్ర ప్రభుత్వం బోర్ల తవ్వకంపై ఆంక్షలు విధించడంతో పాటు, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమయ్యారు.

నిర్మాణ పనులకు తాగునీరు, భూగర్భ జలాలను వినియోగించకుండా శుద్ధి చేసిన నీటిని వాడాలని సూచించారు.

భూగర్భ జలాలను కాపాడేందుకు వాల్టా చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. కొత్త బోరు తవ్వాలన్నా రెవెన్యూ శాఖ అనుమతి తప్పనిసరి. 

నిబంధనలు ఉల్లంఘించి బోర్లు తవ్వుతున్న వారిపై వాల్టా చట్టం కింద కేసులు నమోదు చేసి, రూ.5,000 నుంచి లక్ష వరకు జరిమానా విధించాలని నిర్ణయించింది. 

నిర్మాణ రంగంలో శుద్ధి చేసిన నీటిని మాత్రమే వినియోగించాలని అధికారులు సూచిస్తున్నారు. కానీ వందల కోట్లు పెట్టి భూములు కొనుగోలు చేసి వందల కోట్లతో ఆకాశ హర్మ్యాలు నిర్మిస్తున్నవారు ప్రభుత్వ నిబంధనలను పట్టించుకుంటారా? పట్టించుకోకపోతే వారిని అధికారులు కట్టడి చేయగలరా?

Related Post