మాజీ మంత్రి కొండా సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటూ తనకు క్షమాపణలు చెప్పడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. కొండా సురేఖ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ తాను ఇంకా చూడలేదని కేటీఆర్ అన్నారు. ఆమె ఏమన్నారో పరిశీలించిన తర్వాత తమ న్యాయవాదులతో చర్చించి తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని కేటీఆర్ చెప్పారు.
ఈ సందర్భంగా కేటీఆర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘నిజం నిలకడ మీద తేలుతుందని పెద్దలు ఎప్పుడో చెప్పారు. మొన్న ఒక ప్రముఖ వార్తా పత్రిక నాకు క్షమాపణ చెప్పింది. ఇప్పుడు ఈ మేడం చెప్పారు. రేపు క్షమాపణలు చెప్పేవారు ఇంకా చాలామంది వరుసలో ఉన్నారు.
నాపై ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ రేసు, విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారాల పేరుతో తప్పుడు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. అవన్నీ నిరాధారమైనవని తేలినప్పుడు వాళ్ళు కూడా నాకు క్షమాపణలు చెప్పక తప్పదు.