ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగిస్తున్నారంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను కేంద్ర మంత్రులు, బిజేపి నేతలు ఖండించడం తప్ప తమ ప్రత్యర్ధులను ధీటుగా ఎదుర్కోలేదనే చెప్పాలి. ఎట్టకేలకు బిజేపి మేల్కొని దేశవ్యాప్తంగా భారీ బహిరంగ సభలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది.
నవంబర్ 5న కరీంనగర్లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. ఎస్ఐఆర్ పేరుతో కాంగ్రెస్, ఇండియా కూటమి కేంద్ర ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నాయి. ఈ సభ ద్వారా వాటికి సమాధానం చెప్పడంతో పాటు, ప్రజలకు వాస్తవాలు వివరించి అవగాహన కల్పించాలని అనుకుంటున్నాము. ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి.. అరాచకాన్ని అంతం చేయాలి’ అనే నినాదంతో ఈ సభ నిర్వహించబోతున్నునాము," అని చెప్పారు.
ఓటర్ల జాబితా నుంచి 13 కోట్ల పేర్లు తొలగించారంటూ కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. మరణించినవారు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినవారు, గుర్తించలేని వ్యక్తులు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల పేర్లు నమోదు చేసుకున్నవారి వివరాలను సరిచేసే ప్రక్రియలో భాగంగానే ఈ మార్పులు జరిగాయని పేర్కొన్నారు.
తెలంగాణలో అక్రమంగా వచ్చిన కొందరు వ్యక్తులు కూడా ఓటర్లుగా నమోదు చేసుకున్నారని, ఇలాంటి ఓట్లతో కాంగ్రెస్, బీఆర్ఎస్ లబ్ధి పొందుతున్నాయని బండి సంజయ్ ఆరోపించారు. ఈ సభకు జాతీయ స్థాయి బిజేపి నేతలు హాజరుకానున్నట్లు మంత్రి బండి సంజయ్ తెలిపారు.