హైదరాబాద్‌లో భారీ శబ్దాలతో భూ ప్రకంపనలు

October 27, 2026
img

హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌ పరిసర ప్రాంతాల్లో భూమిలో నుంచి భారీ శబ్దాలు స్థానికులను భయాందోళనకు గురిచేశాయి. 

మంగళవారం ఉదయం ఎర్రబోడ, ఉప్పరపల్లి, రాజేంద్రనగర్‌, అత్తాపూర్‌ ప్రాంతాల్లో ఒక్కసారిగా పేలుడు వంటి భారీ శబ్దాలు వినిపించాయి. అలాగే సుమారు పది సెకన్ల పాటు భూమి కంపించినట్లు స్థానికులు చెబుతున్నారు.

ఒకేసారి నాలుగు ప్రాంతాల్లో భారీ శబ్దాలు రావడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. అసలు ఏం జరిగిందో తెలియక స్థానికులు భూకంపం వచ్చిందా? లేక ఏదైనా పేలుడు కారణంగా ఈ శబ్దాలు వచ్చాయా? లేక ఎక్కడైనా పిడుగులు పడ్డయా? అని చర్చించుకుంటున్నారు. 

ఈ ఏడాది ఫిబ్రవరిలో గాజులరామారం పరిధిలోని మెట్‌కానిగూడ ప్రాంతంలో భారీ శబ్దంతో పాటు భూమి కంపించింది. మెట్‌కానిగూడ, హెచ్‌ఏఎల్‌, ఓక్షిత్‌ ఎన్‌క్లేవ్‌, ఆదర్శనగర్‌ కాలనీల్లో ప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు తెలిపారు. దీంతో అప్రమత్తమైన కొన్ని పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులకు సెలవు ప్రకటించాయి.

తాజాగా రాజేంద్రనగర్‌ పరిసరాల్లోనూ ఇలాంటి ఘటన జరగడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. భారీ శబ్దాలకు అసలు కారణం ఏమిటన్నది తెలియాల్సి ఉంది.

ఎల్‌ఎల్‌నినో ప్రభావం కారణంగా కొంత, నగరంలో లక్షల సంఖ్యలో బోరు బావుల ద్వారా నిరంతరంగా నీటిని తోడేస్తుండటం వలన భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటిపోయినప్పుడు ఆయా ప్రాంతాలలో భూమి లోపలి పొరలు క్రుంగుతుంటాయని భూగర్భ శాస్త్రవేత్తలు చెపుతుంటారు. ఈ భారీ శబ్దాలు, ప్రకంపనలు ఈ క్రుంగుబాటు వల్లనేనా? వారే చెప్పాలి.

Related Post