అక్రమ నీటి దందాలపై హైడ్రా కొరడా!

October 25, 2026
img

హైదరాబాద్‌ నగరంలో నిరంతరంగా డజన్ల కొద్దీ బహుళ అంతస్తుల భవనాలు నిర్మాణాలు జరుగుతుండటం, ఎల్‌నినో ప్రభావం కారణంగా భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. దీంతో నీళ్ళ ట్యాంకర్లకు మళ్ళీ విపరీతమైన డిమాండ్ పెరిగింది. దీంతో ఈ రంగంలో దిగిన పలువురు అక్రమంగా, రహస్యంగా ప్రభుత్వ స్థలాలో బోర్లు వేసి నీళ్ళు తోడేసి అమ్ముకుంటూ కోట్లు సంపాదిస్తున్నారు. 

నీటి కొరత ఏర్పడటంతో హైడ్రా అటువంటి అక్రమ నీళ్ళ వ్యాపారాలు చేస్తున్నవారిపై దృష్టి పెట్టి కోరాడ ఝళిపిస్తోంది. తాజాగా మాదాపూర్‌ సున్నం చెరువు పరిసరాల్లో నవభారత్‌నగర్‌, బోరబండ ఫేజ్‌-3 ప్రాంతాల్లో ఇళ్లలో రహస్యంగా బోర్లు వేసి, భూగర్భ పైపులైన్ల ద్వారా నీటిని తరలిస్తున్నట్లు హైడ్రా అధికారులు గుర్తించారు. 

కొన్ని ఇళ్లలో బెడ్‌రూమ్‌లలో మంచాల కింద, వంటగదుల్లో, మెట్ల కింద కూడా బోర్లు తవ్వినట్లు తనిఖీల్లో బయటపడింది. వీటి నుంచి నీటిని తోడేందుకు శక్తివంతమైన మోటార్లు ఏర్పాటు చేశారు. భూగర్భంలో వందల మీటర్ల పొడవున పైపులైన్లు వేసి నీటిని నిల్వ కేంద్రాలకు తరలిస్తున్నట్లు గుర్తించారు. 

అక్కడి నుంచి పెద్ద ట్యాంకర్లలోకి, అనంతరం చిన్న ట్యాంకర్లలోకి నీటిని నింపి నగరంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 

మాదాపూర్‌, హైటెక్‌ సిటీ ప్రాంతాల్లోని హాస్టళ్లు, హోటళ్లు, ఇతర వాణిజ్య సంస్థలకు ఈ నీటిని విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నిరంతరంగా నీటిని తోడేస్తుండటం వలన ఆ ప్రాంతాల్లో నివసిస్తున్నవారు నీటిని కొనుగోలు చేయాల్సి వస్తోంది. 

ఇంకా దిగ్బ్రాంతి కలిగించే విషయం ఏమిటంటే, సున్నం చెరువు పరిసరాల్లోని భూగర్భ జలాల నమూనాలను పరీక్షించగా సీసం, కాడ్మియం, నికెల్‌ వంటి ప్రమాదకర లోహాలు ఉన్నట్లు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి పరీక్షల్లో వెల్లడైనట్లు అధికారులు తెలిపారు. అదే నీటిని స్థానిక హోటల్స్‌లో, హాస్టల్స్, ఐటి కంపెనీలకు సరఫరా చేస్తున్నట్లు హైడ్రా అధికారులు అనుమానిస్తున్నారు. 


Related Post