అర్నబ్ తుపాను: పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ

October 25, 2026
img

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం అర్నబ్ తుపానుగా మారి తెలుగు రాష్ట్రాల వైపు దూసుకొస్తోంది. 

నేడు (ఆదివారం) బంగాళాఖాతంలో వాయుగుండం మరింత బలపడి, రేపటికి (సోమవారం) తుపానుగా మారబోతోంది. మంగళవారం నాటికి దీని తీవ్రత మరింత పెరుగుతుంది. బుధవారం అర్నాబ్‌ తుపాను ఏపీలోని విశాఖ- బాపట్ల మధ్య తీరం దాటవచ్చని వాతావరణ శాఖ తెలియజేసింది. 

ఈ తుఫాను ప్రభావంతో ఏపీలో అటు శ్రీకాకుళం మొదలు ఇటు కృష్ణా జిల్లా వరకు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. 

ఈ తుఫాను ప్రభావంతో తెలంగాణలో పలు జిల్లాలో భారీ ఈదురుగాలులతో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. 

వాతావరణ శాఖ తెలంగాణలోని ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ మూడు జిల్లాలలో అత్యంత భారీగా వర్షాలు పడతాయని తెలిపింది. 

జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఈ జిల్లాలలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. 

తుఫాను ప్రభావిత ప్రాంతాలలో ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుండి బయటకు రావద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున చెట్లు, విద్యుత్ స్తంభాల కింద నిలబడవద్దని విపత్తు నిర్వహణ శాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా కోత దశకు వచ్చిన పంటలు దెబ్బతినే అవకాశం ఉన్నందున రైతన్నలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

వాతావరణంలో ఈ మార్పు కారణంగా తెలంగాణ అంతటా ఉష్ణోగ్రతలు తగ్గి రాత్రి వేళల్లో చలి పెరిగింది. రాబోయే నాలుగైదు రోజుల్లో మరింత చలి పెరగవచ్చని వాతావరణశాఖ తెలియజేసింది. 

భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని పూర్తిగా అప్రమత్తం చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. 

Related Post