జయేశ్ రంజన్ వీఆర్ఎస్ కోసం దరఖాస్తు.. నిజమేనా?

October 27, 2026


img

తెలంగాణ సీనియర్ ఐఏఎస్ అధికారి జయేశ్ రంజన్ స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. 

ప్రస్తుతం ఆయన మెట్రోపాలిటన్ ప్రాంత, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా చేస్తున్నారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ 30 వరకు అయన పదవీ కాలం ఉంది. కానీ ఏడాది ముందుగానే వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. కానీ ఈ వార్తను అయన లేదా ప్రభుత్వం ద్రువీకరించాల్సి ఉంది. . 

ఒకవేళ ఆయన దరఖాస్తు చేసుకోవడం నిజమే అయితే ముందుగా సిఎం రేవంత్‌ రెడ్డి దానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆయన అనుమతిస్తే, ఆ తర్వాత సీఎస్, అయన ఆదేశం మేరకు  కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీఓపీటీ) ఆమోదించడం లాంచనప్రాయమే.  

జయేశ్ రంజన్ 1992 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కడప, గుంటూరు, మెదక్ జిల్లాల కలెక్టర్‌గా పనిచేశారు. 

హైదరాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ వైస్ చైర్మన్‌గా, ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌గా కూడా బాధ్యతలు నిర్వహించారు. గిరిజన సంక్షేమం, సహజ వనరుల నిర్వహణ, పేదరిక నిర్మూలన వంటి రంగాల్లోనూ పనిచేశారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య రంగాల అభివృద్ధిలో కీలక బాధ్యతలు చేపట్టారు. సుమారు పదేళ్లపాటు ఐటీ, పరిశ్రమల శాఖల్లో ముఖ్య కార్యదర్శిగా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. హైదరాబాద్‌లో టీ-హబ్ ఏర్పాటు, రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడంల్లో ఆయన చాలా కీలక పాత్ర పోషించారు.

కనుక సిఎం రేవంత్‌ రెడ్డి కూడా అయనకు సముచిత గౌరవం, ప్రాధాన్యం కల్పిస్తూ సీఎంవోలో పరిశ్రమలు, పెట్టుబడుల సెల్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఆ తర్వాత ప్రభుత్వ ప్రాజెక్టుల వేగవంతానికి ఉద్దేశించిన ‘స్పీడ్’ కార్యక్రమానికి సీఈఓగా కీలక బాధ్యతలు అప్పగించారు. 

ప్రస్తుతం మెట్రోపాలిటన్ ప్రాంత, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇంత ప్రాధాన్యం ఇస్తున్నప్పటికీ అయన స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) కోసం నిజంగానే దరఖాస్తు చేసుకున్నారా? అయితే ఎందుకు? అనే చర్చ మొదలైంది.


Related Post