తుమ్మిడిహెట్టి: సానుకూలంగా ముగిసిన తెలంగాణ, మహారాష్ట్ర చర్చలు

October 27, 2026


img

కుమరం భీంఆసిఫాబాద్ జిల్లాలో తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుతో బ్యారేజ్ నిర్మించే విషయంపై సోమవారం తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాల మధ్య ముంబయిలో చర్చలు జరిగాయి. 

తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి అధ్వర్యంలో మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, సీఎస్ సంజయ్ జాజు, జలవనరుల శాఖ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

మహారాష్ట్ర సిఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఆ రాష్ట్ర మంత్రి,సీఎస్, జలవనరుల శాఖ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

ఇదివరకు 148 అడుగుల ఎత్తున ప్రతిపాదనకు తాము అంగీకరించామని, కానీ ఇప్పుడు మరో 4 అడుగులు ఎత్తు పెంచి 152 మీటర్ల ఎత్తుతో బ్యారేజ్ నిర్మించదలిస్తే మహారాష్ట్ర ప్రజలు, రైతులకు నష్టం లేకపోతే తనకేమీ అభ్యతరం లేదని మహా సిఎం ఫడ్నవీస్ చెప్పారు. 

కనుక దీనిపై తెలంగాణ, మహారాష్ట్ర అధికారులతో ఓ ఉమ్మడి కమిటీ వేసి అధ్యయనం చేయిద్దామని ఇరుపక్షాలు నిర్ణయించాయి. 

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లో అసిఫాజిల్లాలో వెయిన్ గంగ, వార్ధా నదులు ప్రాణహితలో కలుస్తాయి. కనుక తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజ్ నిర్మించినట్లయితే గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లికి నీళ్ళు అందించవచ్చు. 

అయితే ఈ ప్రతిపాదన ఇప్పటిది కాదు. 1975లోనే అప్పటి ఏపీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు ఒప్పందం కుదుర్చుకున్నారు. కానీ అందరికీ తెలిసిన వివిధ కారాణాల వలన ఇంతవరకు ఈ ప్రాజెక్టు ఏర్పాటు కాలేదు. 

తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చే సరికి కాళేశ్వరం ప్రాజెక్టు వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడింది. కనుక మళ్ళీ ఈ ప్రతిపాదనపై ఆలోచనలు మొదలుపెట్టి ఇప్పుడు మహారాష్ట్రతో చర్చలు మొదలుపెట్టింది. 

కానీ బీఆర్ఎస్‌ పార్టీ ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తోంది. ప్రాణహిత నుంచి గ్రావిటీ ద్వారా నీళ్ళు పారవనే కారణంగానే తాము మేడిగడ్డ బారాజ్‌ నిర్మించామని హరీష్‌ రావు వాదిస్తున్నారు. ఒకవేళ పారిస్తే తాను రాజీనామా చేస్తానని హరీష్‌ రావు సవాలు చేశారు. అయినా కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్ళ తర్వాత ఇప్పుడు తాపీగా మహారాష్ట్రతో చర్చల పేరుతో మరో సరికొత్త డ్రామా మొదలుపెట్టిందని హరీష్‌ రావు విమర్శించారు. 


Related Post